కొడుకును చంపిన తల్లికి.. 18 ఏళ్ల జైలు
ఆటిజంతో బాధపడుతున్న తన కొడుకును చంపిన తల్లికి.. 18 ఏళ్ల జైలుశిక్ష పడింది. 2010 సంవత్సరంలో మన్హట్టన్లోని ఓ ఖరీదైన హోటల్లో ఈ హత్య జరిగింది. తన ఎనిమిదేళ్ల కొడుకు జూడ్ మిర్రాకు క్రషర్, సిరంజి ద్వారా మందులు ఓవర్డోస్లో ఇచ్చి అతడిని చంపేసినట్లు గిగి జోర్డాన్ (54) అంగీకరించారు. అయితే, ఇది కేవలం మానవత్వంతో చేసిన హత్యేనని జోర్డాన్ న్యాయవాది రెండు నెలల విచారణలో వాదించారు. జూడ్ మిర్రా తండ్రి అతడిని లైంగికంగా వేధించకుండా నిరోధించడానికే ఆమె ఈ పని చేసిందన్నారు. దీంతో.. దాదాపు 25 ఏళ్ల వరకు పడాల్సిన జైలు శిక్షను జడ్జి చార్లెస్ సాల్మన్ 18 ఏళ్లకు తగ్గించారు.
తల్లి తన కొడుకును కాపాడుకోవాలనుకోవడం సహజమే గానీ, అందుకోసం ఆమె అతడిని ఎందుకు చంపిదన్న విషయం అర్థం కావట్లేదని జడ్జి వ్యాఖ్యానించారు. వాస్తవానికి మిర్రాకు తన విషయాలు తాను చెప్పుకోవడం చేత కాకపోయినా, తండ్రి ఎమిల్ జెకొవ్ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు తల్లికి చెప్ఆడని న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే యోగా ఉపాధ్యాయుడైన జెకొవ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇక ప్రాసిక్యూటర్లు మాత్రం తన కొడుకు ఆటిజంతో బాధపడుతున్నందువల్ల అతడిని పెంచలేక.. ఆమె అతడిని చంపేసిందని వాదించారు.