సినిమాలు, రెస్టారెంట్లలో తిండి మరింత ఖరీదు?
సినిమాలు, రెస్టారెంట్లలో తిండి మరింత ఖరీదు?
Published Fri, Jan 27 2017 7:29 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నాలుగోసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కొన్ని వాతలు తప్పకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా సేవాపన్నును మరింత పెంచే అవకాశం కనిపిస్తుండటంతో.. దాని ప్రభావం చాలా అంశాల మీద ఉంటుంది. ముఖ్యంగా మల్టీప్లెక్సులలో సినిమాలు చూడటం, రెస్టారెంట్లలో ఆహారం తినడం, విమానాల్లో ప్రయాణించడం.. ఇలాంటివన్నీ కాస్త ఖరీదు పెరగొచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రెండు సెస్‌లతో కలిపి సేవాపన్ను 15 శాతం వరకు ఉన్న సంగతి తెలిసిందే. ఇది మరో 0.5 నుంచి 1 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
సేవాపన్ను అనేది కస్టమర్ల నుంచి సర్వీసు ప్రొవైడర్లు వసూలుచేసి.. మళ్లీ ప్రభుత్వానికి కట్టే పన్ను. ఈ పన్ను పెంచడం వల్ల ఆదాయం పెంచుకోవచ్చన్నది ప్రభుత్వ వర్గాల ఆలోచన. దీనివల్ల ఉద్యోగులకు ఆదాయపన్ను నుంచి మరింత వెసులుబాటు ఇచ్చే అవకాశం కూడా కలుగుతుంది. ఇప్పటికి సేవాపన్నును రెండుసార్లు సవరించారు. 2015-16లో దీన్ని 12.36 నుంచి 14 శాతం చేశారు. ఆ తర్వాత స్వచ్ఛభారత్ సెస్ 0.5 శాతం దీనికి కలిసింది. 2016-17లో కృషి కళ్యాణ్ సెస్ మరో 0.5 శాతం కలవడంతో ఇప్పటికి అది 15 శాతానికి చేరుకుంది. ఇప్పుడు మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది.
Advertisement