మళ్లీ ముఖేశ్‌కే పట్టం...
న్యూయార్క్: అత్యంత సంపన్న భారతీయుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేశ్ అంబానీ ఆరో ఏడాది కూడా నిలిచారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ రూపొందించిన భారత కుబేరుల జాబితాలో 2,100 కోట్ల డాలర్ల సంపదతో ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. 2013 ఏడాదికి అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్ 100 అత్యంత సంపన్న భారతీయుల జాబితాను మంగళవారం వెల్లడించింది. ఈ జాబితాలో ముగ్గురు తెలుగువాళ్లకు.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కుటుంబం, దివీస్ ల్యాబ్స్‌కు చెందిన మురళి, జీఎంఆర్ గ్రూప్ అధిపతి జీఎంరావులకు స్థానం లభించింది. ఈ నెల 18నాటి స్టాక్ మార్కెట్ ధరల ఆధారంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది.
- ఉక్కు సామ్రాట్ లక్ష్మీ మిట్టల్ 1,600 కోట్ల డాలర్ల సంపదతో రెండోస్థానంలో నిలిచారు.
- ఇక మూడో స్థానంలోకి సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ దూసుకువచ్చారు. ఆయన సంపద ఈ ఏడాది 50%(470 కోట్ల డాలర్లు) వృద్ధి చెంది 1,390 కోట్ల డాలర్లకు పెరిగింది. గతేడాది మూడో స్థానంలో ఉన్న విప్రో ప్రేమ్‌జీ(ఈ ఏడాది 4) ని తోసిరాజని సంఘ్వీ మూడో స్థానంలోకి వచ్చారు.
- నిర్మాణ రంగ దిగ్గజం, షాపూర్జీ పల్లోంజి గ్రూప్ అధినేత పల్లోంజి మిస్త్రీ 1,250 కోట్ల డాలర్ల సంపదతో ఐదో స్థానంలో ఉన్నారు. టాటా గ్రూప్‌కు రతన్ టాటా స్థానంలో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సైరస్ మిస్త్రీ ఈయన కుమారుడే.
- ఈ ఏడాది జాబితాలో బిలియనీర్ల (వంద కోట్ల డాలర్ల సంపద) సంఖ్య 65కు పెరిగింది. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య నాలుగు అధికం.
- టాప్-100 సంపన్నుల సంపద ఏడాది కాలంలో 3% వృద్ధి చెంది 25,900 కోట్ల డాలర్లకు పెరిగింది.
- ఇక టాప్ 100 భారత సంపన్నుల జాబితాలో ముగ్గురు తెలుగువాళ్లకు చోటు దక్కింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు చెందిన అంజిరెడ్డి కుటుంబం 175 కోట్ల డాలర్ల సంపదతో 31వ స్థానంలో నిలిచింది. 116 కోట్ల డాలర్ల సంపదతో దివీస్ మురళి 60వ స్థానంలోనూ, 102 కోట్ల డాలర్లతో జీఎంఆర్ గ్రూప్‌కు చెందిన గ్రంధి మల్లికార్జున రావు 63వ స్థానంలోనూ ఉన్నారు.
మహిళలు ఐదుగురే..
టాప్ 100 భారత సంపన్నుల జాబితాలో ఐదుగురు మహిళలకే స్థానం దక్కింది. ఈ ఏడాది జాబితాలో సావిత్రి జిందాల్(జిందాల్ గ్రూప్-14 వ స్థానం-490 కోట్ల డాలర్లు), ఇందు జైన్(బెనెట్ కోల్‌మన్ కంపెనీ-29వ స్థానం-190 కోట్ల డాలర్లు), అను అగా(థెర్మాక్స్-86వ స్థానం-73 కోట్ల డాలర్లు), కిరణ్ మజుందార్ షా(బయోకాన్-96వ స్థానం-65.5 కోట్ల డాలర్లు), శోభన భర్తియ(హిందూస్తాన్ టైమ్స్-98వ స్థానం-64.5 కోట్ల డాలర్లు)లు ఉన్నారు.