న్యూయార్క్: అత్యధిక సంఖ్యలో కుబేరులున్న దేశాల జాబితాలో అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో స్థానంలో నిల్చింది. అమెరికాలో బిలియనీర్ల సంఖ్య 614 నుంచి 724కి చేరింది. చైనాలో 456 నుంచి 698కి చేరింది. ఈ రెండు దేశాల తర్వాత అత్యధికంగా 140 మంది బిలియనీర్లతో భారత్ మూడో స్థానంలో ఉంది. జర్మనీ (136), రష్యా (117) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ 35వ వార్షిక బిలియనీర్ల జాబితా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ఇక బిలియనీర్స్ జాబితా ప్రకారం పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి మొత్తం ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ క్రమంలో చైనా వ్యాపార దిగ్గజం జాక్ మాను రెండో స్థానానికి నెట్టారు. ముకేశ్ అంబానీ 84.5 బిలియన్ డాలర్ల సంపదతో టాప్ 10 అంతర్జాతీయ బిలియనీర్స్ జాబితాలో మరోసారి పదో స్థానం దక్కించుకున్నారు. అటు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భారత్‌లో రెండో స్థానంలోనూ అంతర్జాతీయంగా 24వ స్థానంలోనూ ఉన్నారు. ఆయన సంపద విలువ 50.5 బిలియన్ డాలర్లు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (23.5 బిలియన్ డాలర్లు) దేశీయంగా మూడో స్థానంలో, అంతర్జాతీయంగా 71వ ర్యాంకులోనూ నిల్చారు.
నంబర్‌వన్‌గా నాలుగోసారి బెజోస్ ..
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపక సీఈవో జెఫ్ బెజోస్ వరుసగా నాలుగో ఏడాది కూడా ఈ లిస్టులో అగ్రస్థానంలో నిల్చారు. ఆయన సంపద 64 బిలియన్ డాలర్లు పెరిగి 177 బిలియన్ డాలర్లకు చేరింది. ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ 151 బిలియన్ డాలర్ల సంపదతో (126 బిలియన్ డాలర్ల వృద్ధి) రెండో స్థానంలో ఉన్నారు. బిలియనీర్స్ జాబితాలో సంపన్నుల సంఖ్య 660 పెరిగి 2,755కి చేరింది. వీరి సంపద విలువ 13.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ]
Comments
Please login to add a commentAdd a comment