ముదిరిన సంక్షోభం; కుమారుడికి షోకాజ్ నోటీసు
- రెబెల్స్ జాబితాపై ములాయం గుస్సా
- అఖిలేష్‌తో పాటు రాంగోపాల్‌కూ నోటీసులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం ముదిరింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమీప బంధువు రాంగోపాల్ యాదవ్‌లకు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ములాయంకు అఖిలేష్ కుమారుడన్న విషయం తెలిసిందే. ఇక రాంగోపాల్ ఆయనకు వరుసకు సోదరుడు అవుతారు.
ములాయం కుటుంబంలో గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అఖిలేష్‌కు, ఆయన బాబాయ్, యూపీ ఎస్పీ చీఫ్ శివపాల్ యాదవ్‌కు పడటం లేదు. వీరిద్దరి మధ్య రాజీకుదిర్చేందుకు ములాయం ప్రయత్నించినా సాధ్యంకాలేదు. దీనికితోడు ఇటీవల టికెట్ల కేటాయింపు వ్యవహారం ఏకంగా తండ్రీకొడుకులు ములాయం, అఖిలేష్ మధ్య విభేదాలకు కారణమైంది. అఖిలేష్ సూచించిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా ములాయం జాబితాను ప్రకటించారు. 325 మంది పేర్లతో ములాయం సింగ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ లు బుధవారం జాబితా విడుదల చేశారు. దీంతో ఆగ్రహం చెందిన అఖిలేష్ తన మద్దతుదారులతో సమావేశమై రెబెల్స్గా బరిలోకి దిగాలని సూచించారు. అఖిలేష్‌కు రాంగోపాల్ యాదవ్ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల కింద ములాయం.. వీరిద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఎస్పీలో చీలిక ఏర్పడవచ్చని భావిస్తున్నారు.