ఎస్పీలో ముదిరిన ముసలం | War in the samajwadi party | Sakshi
Sakshi News home page

ఎస్పీలో ముదిరిన ముసలం

Published Sat, Dec 31 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

ఎస్పీలో ముదిరిన ముసలం

ఎస్పీలో ముదిరిన ముసలం

అఖిలేశ్‌ను ఆరేళ్లపాటు బహిష్కరించిన ములాయం

- సోదరుడు రాంగోపాల్‌ పైనా వేటు.. పార్టీని నాశనం చేశారని ధ్వజం
- కొత్త సీఎం అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని వెల్లడి
- బహిష్కరించినా నేనే ప్రధాన కార్యదర్శిని: రాంగోపాల్‌

లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం శుక్రవారం  మరింత ముదిరింది. అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరడంతో... ఏకంగా కొడుకు అఖిలేశ్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ ఎస్పీ అధినేత ములాయం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనను ధిక్కరించి ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌ సొంతంగా అభ్యర్థుల జాబితా ప్రకటించడంపై ఆగ్రహంతో ఉన్న ములాయం.. గీత దాటితే ఎవరినీ ఉపేక్షించబోమంటూ గట్టి సంకేతాలు ఇచ్చారు. కొడుకుతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సోదరుడు, ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌ యాదవ్‌నూ ఆరేళ్ల పాటు బహిష్కరించారు. త్వరలో కొత్త సీఎం అభ్యర్థిని పార్టీ ఎన్నుకుంటుందని తెలిపారు. తాజా పరిణామాలతో  పార్టీలో చీలిక ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.  ‘పార్టీ తన అభ్యర్థుల్ని ప్రకటించాక... అఖిలేశ్‌ మరో జాబితా ఎలా విడుదల చేస్తారు? అఖిలేశ్, రాంగోపాల్‌లు పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారు. అలా జరగనివ్వను. పార్టీని నేను ఎంతో కష్టపడి నిర్మించా’ అని విలేకరుల సమావేశంలో ములాయం పేర్కొన్నారు. అఖిలేష్‌ను అట్టహాసంగా సీఎంను చేశానని, ఇప్పుడు పార్టీని నాశనం చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలేశ్‌ క్షమాపణలు చెపితే సస్పెన్షన్‌ ఎత్తివేస్తారా? అని ప్రశ్నించగా బదులివ్వలేదు.  

( చదవండి : కొత్త సీఎంను నేనే ప్రకటిస్తా: ములాయం)

అభ్యర్థుల జాబితాపై ఫలించని రాజీ చర్చలు
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ములాయం రెండు రోజుల క్రితం విడుదల చేయగా, అఖిలేశ్‌ గురువారం రాత్రి 235 మందితో సొంత జాబితా విడుదల చేశారు. ఈ వ్యవహారంలో తండ్రీ కొడుకుల మధ్య గురువారం రాత్రి నుంచి రాజీ ప్రయత్నాలు సాగినా అఖిలేశ్‌ వర్గం వెనక్కి తగ్గలేదు.  శుక్రవారం ఉదయం నుంచి పరిణామాలు వేగంగా మారిపోయాయి. పెద్ద ఎత్తున అఖిలేశ్‌ మద్దతుదారులు ఆయనింటికెళ్లి మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో పార్టీని ధిక్కరించి అభ్యర్థుల జాబితా ప్రకటించినందుకు అఖిలేశ్, రాంగోపాల్‌లకు పార్టీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

మరింత ఆజ్యం పోసిన రాంగోపాల్‌
వివాదానికి ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌ యాదవ్‌ మరింత ఆజ్యం పోశారు. శుక్రవారం మధ్యాహ్నం  అత్యవసర విలేకరుల భేటీ నిర్వహించి... జనవరి 1న పార్టీ జాతీయ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. అఖిలేశ్‌ ప్రకటించిన జాబితాలోని అభ్యర్థులే ఎన్నికల్లో పోటీచేస్తారని, రెండుమూడు రోజుల్లో తుది జాబితా సిద్ధం చేస్తామని తెలిపారు. పార్టీలో కొందరు ములాయంను తప్పుదోవ పట్టిస్తున్నారని, అఖిలేశ్‌ నేతృత్వంలోనే పార్టీకి భవిష్యత్తు ఉందని చెప్పారు. రాంగోపాల్‌ వ్యాఖ్యలతో రగిలిపోయిన ములాయం... మరో సోదరుడు శివ్‌పాల్‌ యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎంతో కష్టపడి నిర్మించిన పార్టీని కాపాడుకునేందుకు అఖిలేశ్, రాంగోపాల్‌పై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. ‘మనం పార్టీని కాపాడుకోవాలి. పార్టీనే ముఖ్యం. అందుకే అఖిలేశ్, రాంగోపాల్‌ను బహిష్కరిస్తున్నా’ అని చెప్పారు.

(చదవండి: అఖిలేష్ భవితవ్యం ఏమిటి?)


రాంగోపాల్‌ ప్రకటన వల్లే వేటు: ములాయం
పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న రాంగోపాల్‌ పార్టీ అత్యవసర సమావేశం ప్రకటన చేయడం, దాన్ని అఖిలేశ్‌ సమర్థించడం వల్లే బహిష్కరించామని ఆయన పేర్కొన్నారు. పార్టీ అత్యవసర భేటీ కోసం పిలుపునిచ్చే అధికారం కేవలం పార్టీ అధ్యక్షుడికి మాత్రమే ఉందని, రాంగోపాల్‌ వెర్రి పనులతో పార్టీ నడవదన్నారు. అఖిలేశ్‌ భవిష్యత్తును రాంగోపాల్‌ నాశనం చేశారని, అది అతను అర్థం చేసుకోవడం లేదన్నారు. ‘మేం కష్టపడ్డాం. వాళ్లు ఫలితం అనుభవిస్తున్నారు. ఎమర్జెన్సీలో జైలుకెళ్లా.. రాంగోపాల్‌ వెళ్లాడా?’ అని ములాయం ప్రశ్నించారు. క్రమశిక్షణారాహిత్యం వల్ల సెప్టెంబర్‌లోనూ రాంగోపాల్‌ను సస్పెండ్‌ చేశామని,  క్షమాపణలు చెప్పడంతో తిరిగి చేర్చుకున్నామని చెప్పారు.

 ప్రధాన కార్యదర్శిగా తప్పుకోను: రాంగోపాల్‌
బహిష్కరణ అప్రజాస్వామికమని, తాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతానని రాంగోపాల్‌ అన్నారు. ‘అగ్రనాయకత్వమే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే... పార్టీ భేటీకి ఎవరు పిలుపునిస్తారు? పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆ పని చేశాన’న్నారు. ములాయం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాను తప్పుపడుతూ... జాబితా ఎంపిక కోసం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా నిర్వహించలేదని విమర్శించారు. అఖిలేశ్‌ ప్రకటించిన అభ్యర్థులు తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారనిన్నారు. షోకాజ్‌ నోటీసు జారీ చేసిన రెండు గంటల్లోపే తనను బహిష్కరించారని, వివరణ  వినకుండా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ‘కోర్టులోనూ ఇతరుల అభిప్రాయాల్ని వినేందుకు అవకాశమిస్తారు. సుప్రీంకోర్టు కంటే గొప్పగా భావించే ములాయం చీఫ్‌గా ఉన్న పార్టీలో అలా జరగలేదు’ అని అన్నారు. కార్యకర్తల ఒత్తిడి మేరకే అభ్యర్థుల జాబితాను అఖిలేశ్‌ విడుదల చేశారని చెప్పారు.  కాగా, గవర్నర్‌ రాం నాయక్‌ స్పందిస్తూ... పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. ఇది ఎస్పీ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. ఒకవేళ సీఎం అఖిలేశ్‌ను మార్చాలని పార్టీ నిర్ణయిస్తే గవర్నర్‌ పాత్రే కీలకమవుతుంది.

నివురుగప్పిన నిప్పులా..
అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన తాజా సంక్షోభం యూపీ రాజకీయ ముఖచిత్రంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టనుంది. అంతేకాకుండా, దేశ రాజకీయాల పైనా ప్రభావం చూపనుంది. అయితే, ఈ సంక్షోభం హఠాత్తుగా తలెత్తింది కాదు. నివురు గప్పిన నిప్పులా రగులుతూ.. ఎన్నికల ముంగిట ఒక్కసారిగా బద్ధలైంది. ఇందుకు ములాయం, అఖిలేశ్‌లు వేర్వేరుగా ప్రకటించిన అభ్యర్థుల జాబితా కారణమైంది. ములాయం కోటలో పుట్టిన ఈ ముసలం పుట్టుపుర్వోత్తరాలివీ..!

2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ గెలిస్తే ములాయమే సీఎం అవుతారని అంతా అనుకున్నారు. కానీ, అఖిలేశ్‌ అనూహ్యంగా  తెరపైకి వచ్చారు. అప్పుడు తన కొడుకును సీఎంగా అంగీకరించాలని తమ్ముడు శివపాల్, ఆజం ఖాన్‌ వంటి సీనియర్లకు ములాయం నచ్చజెప్పాల్సి వచ్చింది. ఆరంభంలో కీలుబొమ్మ సీఎంగానే అఖిలేశ్‌ కనిపించారు. అందుకే, యూపీకి మూడున్నర ముఖ్యమంత్రులనే మాట(ములాయం, శివపాల్, ఆజంఖాన్‌–ముగ్గురయితే, అఖిలేశ్‌ అర సీఎం అనే అర్ధం) ప్రచారంలోకి వచ్చింది.

నెమ్మదిగా బలపడిన అఖిలేశ్‌
మొదటి రెండేళ్లలో ప్రతి విషయంలో ములాయం జోక్యం ఎక్కువగా ఉండేది. బహిరంగంగానే కొడుకును మందలించడం, హెచ్చరించడం రివాజుగా మారింది. ఈ పరిస్థితుల నుంచి నెమ్మదిగా బయటిపడిన యువ సీఎం మంచి పేరు తెచ్చుకోవడం మొదలైంది. ఎన్నికల వాగ్దానాలు చాలా వరకు అమలు చేయడమేగాక, లక్నో మెట్రో, ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వే వంటి మెగా ప్రాజెక్టులు ఆయనకు జనాదరణ పెంచాయి. అవినీతి మరక అంటని సీఎంగా కూడా కనిపించారు.

( చదవండి  : చీలిపోనున్న సమాజ్ వాదీ పార్టీ?)

తమ్ముడు, రెండో భార్య, అనారోగ్యం
ఆరేడేళ్లుగా ములాయం(77)కు ప్రొస్ట్రేట్‌ గ్రంథి వాపు సమస్యతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలున్నాయి. రెండో భార్య సాధనా గుప్తా, రెండో కొడుకు ప్రతీక్‌ యాదవ్‌(సాధన కొడుకు) భార్య అపర్ణా యాదవ్‌.. అఖిలేశ్‌ల మధ్య ములాయం వారసత్వం విషయంలో విభేదాలున్నాయి. శివపాల్‌ మొదట్నించీ వదిన సాధనాగుప్తాకు దగ్గరే. అలాగే, సాధనను భార్యగా ప్రకటించేలా ములాయంతో ప్రకటన చేయించడంలో కీలకపాత్ర పోషించిన రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌ కూడా సాధనకు సన్నిహితుడే. కొన్నాళ్లు ఎస్పీ వెలుపల ఉన్న అమర్‌సింగ్‌ను మళ్లీ చేర్చుకుని రాజ్యసభ సీటివ్వడం కూడా అఖిలేశ్‌కు ఇష్టం లేదు. అఖిలేశ్, ఆయన చిన్నాన్న రాంగోపాల్‌ యాదవ్‌ ఒక వర్గంగా, తమ్ముడు శివపాల్‌ మరో వర్గంగా ఎస్పీ చీలిపోయింది. అనేక కారణాల వల్ల శివపాల్, భార్య సాధనవైపే ములాయం నిలిచారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్న అఖిలేశ్‌ తన వర్గం వారికి టికెట్లు ఇవ్వరేమోననే అనుమానంతో ములాయం ఆయనను ఆ పదవి నుంచి తప్పించి శివపాల్‌ను నియమించడంతో సంక్షోభం ఈ అక్టోబర్‌ ఆఖరుకు బాగా ముదిరిపోయింది. తాత్కాలికంగా రాజీ కుదిరినా పార్టీ లక్నో సమావేశంలో విభేదాలు బహిర్గతమయ్యాయి.

‘క్లీన్‌ ఇమేజ్‌’, కాంగ్రెస్‌తో పొత్తుతో అఖిలేశ్‌ ముందడుగు
కాంగ్రెస్‌తో పొత్తు, తన  ‘క్లీన్‌ ఇమేజ్‌’ల సాయంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలనుకున్నారు అఖిలేశ్‌. అయితే, 1999లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రధాని కాకుండా అడ్డుకున్న ములాయం మరోసారి కాంగ్రెస్‌ వ్యతిరేకతను ముందుకుతెచ్చి ఈ పార్టీతో పొత్తుకు నిరాకరించారు. ప్రధాని నరేంద్రమోదీతో ఉన్న రహస్య అవగాహన కూడా ములాయం వైఖరికి కారణమని కొందరు అనుమానిస్తున్నారు.  
 –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement