మాయావతితో దోస్తీకి సిద్దం: ములాయం
న్యూఢిల్లీ: మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్వాది పార్టీతో చేతులు కలిపేందుకు సిద్దమని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. అయితే చిన్న మెలిక పెట్టారు. ఇందుకు ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ చొరవ తీసుకోవాలని అన్నారు. ' ఈ విషయంలో లాలూ చొరవ తీసుకుంటే, బీఎస్పీతో చేతులు కలిపేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు' అని ములాయం అన్నారు.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి వ్యతిరేకంగా బీఎస్పీ, ఎస్పీ కలిసి పనిచేయాలని లాలూ చేసిన సూచన గురించి అడిగినప్పుడు ములాయం ఈ విధంగా స్పందించారు. 23 ఏళ్ల విరామం తర్వాత బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్, జేడీ(యూ) నాయకుడు నితీష్ కుమార్ మళ్లీ ఒక్కటయ్యారు. ఇదే తరహాలో బీఎస్పీ, ఎస్పీ కలిసిపోవాలని ఆయన సూచించారు.
1993లో యూపీలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఈ కూటమి ఓడిపోవడంతో బీఎస్సీతో కలిసి పోటీ చేసి తప్పుచేశామని అప్పట్లో ములాయం సింగ్ వ్యాఖ్యానించారు. ఏనుగు గుర్తు ఉన్న బీఎస్సీతో సైకిల్ గుర్తు ఉన్న సమాజ్వాదీ పార్టీకి మళ్లీ జట్టు కుదురుతుందో, లేదో చూడాలి.