లక్నో : పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వ బంగ్లాలలో ఉన్న మాజీలను ఖాళీ చేయించాల్సిందిగా ఈ నెల 7న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయవతి ముఖ్యమంత్రి పదవులలో ఉన్న సమయంలో వారికి అధికారిక ప్రభుత్వ బంగ్లాలను కేటాయించారు. అయితే ముఖ్యమంత్రి పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా వారు బంగ్లాలను ఖాళీ చేయకుండా అందులోనే ఉంటున్నారు. దీనిపై సుప్రీం తీర్పును అనుసరిస్తూ.. కేంద్ర ప్రభుత్వం, బంగ్లాలను ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై స్పందించిన అఖిలేష్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సొంత ఇంటిని నిర్మించుకోకుండా తప్పు చేశానని అన్నారు.
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి అద్దె ఇంటికి మారేందుకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టును కోరినట్టు తెలిపారు. లేక కోర్టు కొంత సమయం ఇస్తే గడువులోగా సొంత ఇంటిని నిర్మించుకుంటానని అన్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల అనంతరం ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు అందుకున్న వారిలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజస్తాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్, ఎన్‌డీ తివారీలు కూడా ఉన్నారు. అఖిలేష్ యాదవ్ లక్నోలోని విక్రమాదిత్య రోడ్డు 4 నెంబర్ ప్రభుత్వ బంగ్లాలో ఉండగా, అదే విధిలో ఐదో నెంబర్ బంగ్లాలో గత 27 ఏళ్లుగా ములాయం సింగ్ యాదవ్ ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment