అచ్చం సినిమాలోలాగానే..
ముంబయి: సినిమాల ప్రభావం జనాలపై ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే, ఆ ప్రభావం కూడా రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి, వ్యక్తులను బట్టి వేర్వేరుగా ఉంటుంది. కొందరు పాజిటివ్గా తీసుకుంటే మరికొందరు నెగెటివ్గా తీసుకుంటారు. దీంతో ఎలాంటి పనులకైనా తెగబడతారు. ముంబయిలో ఓ స్నేహితుల బృందం ఒక బాలీవుడ్ చిత్రాన్ని చూసి తీవ్ర ప్రభావానికి లోనైంది. ఎంతంటే ఆ స్నేహితుల్లో ఒకరి మేనమామ ఇంటినే లూటీ చేయాలన్నంత. అనుకుందే తడువుగా పథకం రచించారు. గత నెల 26న టీవీలో బాలీవుడ్ సినిమా చూసి అచ్చం అందులో ఉన్నట్లుగానే.. ఫేక్ ఇన్కం ట్యాక్స్ అధికారుల అవతారం ఎత్తారు.
వెంటనే ఆ స్నేహితుల్లో జగదీశ్ మెవాడా అనే యువకుడు తన మామ రాంజీభాయ్ వద్ద సొమ్ములు బాగా ఉన్నాయని, వాటిని ఆయన స్నేహితుడు జయంతిభాయ్ సార్వేయా వద్ద ఉంచాడని చెప్పారు. తాను బయట ఉంటానని మీరంతా ఇన్ ట్యాక్స్ అధికారుల్లా వెళ్లాలని కోరాడు. దీంతో వారంత ఈ నెల ఉదయాన్నే 7.30కు అచ్చం అధికారుల్లాగే.. కారుల్లో దిగిపోయారు. టకటకా తనిఖీలు చేశారు. దీంతో కంగారు పడిపోయిన వాళ్ల మామ ఇంట్లోని రూ.1.65 కోట్ల విలువైన బంగారం నగలు, వాచీలు, తదితర వస్తువులు కొంత డబ్బు వారికి అప్పగించాడు. ఈ విషయం ఎట్టకేలకు పోలీసులకు తెలిసి వారిని అరెస్టు చేసింది. సొంత మేనల్లుడే ఈ పనిచేశాడని నిర్ధారించింది.