Mumbai Crime
-
ఎంటీఎన్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాంద్రాలోని ఎంటీఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎగసిపడుతున్నాయి. బిల్డింగ్‌లో దాదాపు 100మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 14 ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. లోపల చిక్కుకున్నవారి సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. అగ్నిప్రమాదంలో 9 అంతస్తుల భవనం మొత్తం దట్టంగా పొగ కమ్మేసింది. మూడు, నాలుగు అంతస్తుల్లో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారి స్పందిస్తూ కార్యాలయం మొత్తం పొగతో నిండిపోయిందని, కొందరు 10వ అంతస్తులో చిక్కుకుపోయారని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. -
సరదగా జెట్ స్కై రైడ్‌కు వెళ్లిన బాలికపై...
సాక్షి, ముంబై : సరదాగా గడపడానికి విహార యాత్రకు వెళ్లిన తల్లీ కూతుళ్లకు చేదు అనుభవం ఎదురైంది. ముంబైకి చెందిన మహిళ తన ఏడేళ్ల కుమార్తెతో మాల్ధీవులకు సరదాగా గడిపేందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో వారు జెట్ స్కై రైడ్‌కి వెళ్లాలనుకున్నారు. అయితే స్కైరైడ్‌కి ఒకేసారి ఇద్దరు వెళ్లాడానికి వీలు లేకపోవడంతో ఆ మహిళ తన కుమార్తెను డ్రైవర్ వెంట పంపించింది. రైడింగ్‌లో బాలిక ఒంటరిగా ఉండటంతో డ్రైవర్ తన వక్రబుద్ది చూపించి, బాలికను లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత జెట్ నుంచి తిరిగి వస్తున్న బాలిక ఆందోళనగా కనిపించడంతో తల్లి అనుమానించింది. దీంతో మహిళ కుమార్తెను ప్రశ్నించగా ‘జెట్ స్కై డ్రైవర్ తనతో ఆసభ్యంగా ప్రవర్తించాడని’ బాలిక తెలిపింది. డ్రైవర్ నిర్వాకంపై వారు మాల్దీవుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు బాలిక తల్లికి తెలిపారు. అయితే ఆరోజే వారు తిరిగి ముంబై రావాల్సి ఉండటంతో వైద్య పరీక్షలు ముంబైలో నిర్వహిస్తానని పోలీసులకు చెప్పి ఫిర్యాదు పత్రాన్ని తిసుకుని తిరిగి ముంబైకి బయలుదేరారు. మాల్దీవుల నుంచి ఇంటికి చేరుకున్న మహిళ శనివారం ఉదయం జూహులోని కూపర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం తన కుమార్తెను తీసుకుని వెళ్లింది. ఆస్పత్రికి వెళ్లాక వారిని గంటల కొద్ది వేచిఉంచారని, పరీక్షల కోసం అటు ఇటు తిప్పి చివరకు మైనర్ బాలికకి వైద్య పరీక్షలు చేయడం పోక్సో చట్టం ప్రకారం నేరమని వారితో చెప్పినట్లు బాలిక తల్లి తెలిపింది. తన వద్ద మాల్దీవ్ పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రం ఉన్నప్పటికి ఆస్పత్రి వారు మహిళా కానిస్టేబుల్ లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం చట్ట ప్రకారం నేరమని బుకాయించినట్లు ఆమె తెలిపింది. అయితే మైనర్ బాలిక లైంగిక వేధింపులకు గురై ఆస్పత్రికి వెళితే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల బాధిత బాలిక తల్లి ఆందోళన వ్యక్తం చేశారు. -
అచ్చం సినిమాలోలాగానే..
ముంబయి: సినిమాల ప్రభావం జనాలపై ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే, ఆ ప్రభావం కూడా రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి, వ్యక్తులను బట్టి వేర్వేరుగా ఉంటుంది. కొందరు పాజిటివ్‌గా తీసుకుంటే మరికొందరు నెగెటివ్‌గా తీసుకుంటారు. దీంతో ఎలాంటి పనులకైనా తెగబడతారు. ముంబయిలో ఓ స్నేహితుల బృందం ఒక బాలీవుడ్ చిత్రాన్ని చూసి తీవ్ర ప్రభావానికి లోనైంది. ఎంతంటే ఆ స్నేహితుల్లో ఒకరి మేనమామ ఇంటినే లూటీ చేయాలన్నంత. అనుకుందే తడువుగా పథకం రచించారు. గత నెల 26న టీవీలో బాలీవుడ్ సినిమా చూసి అచ్చం అందులో ఉన్నట్లుగానే.. ఫేక్ ఇన్‌కం ట్యాక్స్ అధికారుల అవతారం ఎత్తారు. వెంటనే ఆ స్నేహితుల్లో జగదీశ్ మెవాడా అనే యువకుడు తన మామ రాంజీభాయ్ వద్ద సొమ్ములు బాగా ఉన్నాయని, వాటిని ఆయన స్నేహితుడు జయంతిభాయ్ సార్వేయా వద్ద ఉంచాడని చెప్పారు. తాను బయట ఉంటానని మీరంతా ఇన్ ట్యాక్స్ అధికారుల్లా వెళ్లాలని కోరాడు. దీంతో వారంత ఈ నెల ఉదయాన్నే 7.30కు అచ్చం అధికారుల్లాగే.. కారుల్లో దిగిపోయారు. టకటకా తనిఖీలు చేశారు. దీంతో కంగారు పడిపోయిన వాళ్ల మామ ఇంట్లోని రూ.1.65 కోట్ల విలువైన బంగారం నగలు, వాచీలు, తదితర వస్తువులు కొంత డబ్బు వారికి అప్పగించాడు. ఈ విషయం ఎట్టకేలకు పోలీసులకు తెలిసి వారిని అరెస్టు చేసింది. సొంత మేనల్లుడే ఈ పనిచేశాడని నిర్ధారించింది.