
ప్రీతిజింటా - నెస్ వాడియా
ముంబై: బాలీవుడ్ నటి ప్రీతిజింటా, ఐపిఎల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యాజమాన్య భాగస్వామి, ప్రముఖ వ్యాపార వేత్త నెస్ వాడియా మధ్య గొడవ ఎక్కడ జరిగిందో తమకు స్పష్టంగా తెలియాలని ముంబై పోలీసులు అంటున్నారు. మే 30న వాంఖేడ్ స్టేడియంలో పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని, అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి జింటా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారు ఎక్కడ గొడవపడ్డారో తెలుసుకునేందుకు మరోసారి ప్రీతిజింటా స్టేట్‌మెంట్ రికార్డు చేస్తామని పోలీసులు తెలిపారు.
సీసీ ఫుటేజీలో ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సమాచారం లభించడంలేదని ముంబై పోలీసులు తెలిపారు. గ్యాలరీ ముందు భాగంలో ప్రీతిజింటా ఉన్నట్లు వారు తెలిపారు. ప్రీతితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆమె ఫోన్ స్విచాఫ్ చేసి ఉందని చెప్పారు. ఆమె లాయర్‌ను సంప్రదించినట్లు తెలిపారు. ప్రీతి చెప్పినట్లుగా పేర్కొన్న ఇద్దరు సాక్షులనూ సంప్రదించామని చెప్పారు. ఇవాళ లేదా రేపు వారి దగ్గర నుంచి స్టేట్‌మెంట్లు తీసుకుంటామని ముంబై పోలీసులు తెలిపారు.