పెళ్లికి ముందే ప్లాన్ చేసి..
ముంబై: పెళ్లైన నాలుగు రోజులకే వధువును పాశవికంగా హత్య చేసిన దారుణ ఘటన ముంబై శివారులో చోటుచేసుకుంది. నవ వధువును ముక్కలుగా నరికి శరీర భాగాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గతవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి భర్త సిద్ధేశ్(25), అతడి తల్లిదండ్రులు మనోహర్ సీతారామ్(50), మాధురి(48), వారి స్నేహితులు దుర్గేశ్ పట్వా(31), ప్రదీప్ జైన్(34) కలిసి ఈ కిరాతకానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు.
ప్రియాంక(23) అనే యువతికి ఏప్రిల్ 30న సిద్ధేశ్‌తో పెళ్లి జరిగింది. ప్రియాంక కనిపించడం లేదని వర్లీ పోలీస్ స్టేషన్‌లో సిద్ధేశ్, అతడి కుటుంబ సభ్యులు మే 6న ఫిర్యాదు చేశారు. మే 5న ఇంటర్వ్యూకు వెళ్లి ఆమె తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సిద్ధేశ్, అతడి కుటుంబ సభ్యులను వేర్వేరుగా విచారించడంతో నిజం బయటపడింది. ప్రియాంక మే 5న ఇంటి దగ్గరే ఉన్నట్టు ఆమె మొబైల్ టవర్ లొకేషన్ ద్వారా గుర్తించి కూపీ లాగడంతో దురాగతం బయటపడిందని నవీ ముంబై క్రైమ్‌బ్రాంచ్ సీనియర్ ఇన్స్‌పెక్టర్ జగదీశ్ కులకర్ణి తెలిపారు.
ప్రియాంకను మే 4న హత్య చేసినట్టు పోలీసు విచారణలో నిందితులు అంగీకరించారు. నిద్రలో ఉండగా ప్రియాంక ముఖంపై తలగడతో అదిమిపెట్టి ఆమెను చంపేశారు. మృతదేహాన్ని దుర్గేశ్ మూడు ముక్కలుగా చేశాడు. శరీర భాగాలను ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి మూడు వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. థానెలోని షాహపూర్-నాసిక్ రహదారికి దగ్గరలోని అడవిలో మృతురాలి తల దొరికింది. పెళ్లికి ముందు పథకం పన్నామని, దాని ప్రకారమే ప్రియాంకను హతమార్చినట్టు పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నారు. తనతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేసేందుకు ప్రయత్నించిన సిద్ధేశ్‌పై ఒత్తిడి తెచ్చి పెళ్లి చేసుకుందున్న అక్కసుతో ప్రియాంకను హత్య చేశామని నిందితులు వెల్లడించారు.