పక్కింటావిడతో గొడవ: ధోనీ వీరంగం
ముంబై: తల్లిని చెంపదెబ్బకొట్టిందని పక్కింటావిడపై ప్రతీకారం తీర్చుకునేందుకు కత్తి చేతబట్టుకుని వీరంగం సృష్టించిన ధోనీ గోపాల్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తర ముంబైలోని భయాందార్ ప్రాంతంలో ప్లానెటేరియా కాంప్లెక్స్ అనే అపార్ట్ మెంట్లో పక్కపక్క ఫ్లాట్లలో ఉండే ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. అందులో ఒక మహిళ కోపంతో మరొకామెను చెంపదెబ్బకొట్టింది. ఈ విషయం తెలుసుకున్న (దెబ్బతిన్న) మహిళ కొడుకు ధోనీ గోపాల్(20) ఇంట్లో ఉన్న కత్తి తీసి పక్కింటావిడిపైకి వెళ్లాడు. ముందుజాగ్రత్తగా ఆమె తలుపులు వేసుకోవడంతో, ధోనీ బయటికి వచ్చి సన్ షేడ్లు, రెయిలింగ్స్ మీదుగా మూడో ఫ్లోర్ లోని మహిళ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
అయితే ఆమె ఫ్లాట్ కు ఇనుప గ్రిల్స్ ఉండటంతో లోపలికి వెళ్లలేక తలుపుల్ని బద్దలుకొట్టాడు. యువకుడి వీరంగం చూసి విస్తుపోయిన స్థానికులు కొద్దిసేపటి తర్వాత కిందికి దిగిన అతణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.సదరు యువకుడు కాలేజీ విద్యార్థి ధోనీ గోపాల్(20)అని, అతను ఉపయోగించిన కత్తి మతకార్యక్రమాల కోసం వినియోగించేదని, హత్యాయత్నం కేసుకింద అతణ్ని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ధోనీ.. ఎంతపనిచేశావయ్యా!
