
నా పిల్లలు విశాఖలో చదువుతున్నారు
తన పిల్లలు విశాఖపట్నంలో చదువుకుంటున్నారని, అందుకే వాళ్లను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో రాజమండ్రిలో చికిత్స పొందానని ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. తాను సత్తుపల్లి ఎమ్మెల్యేను కాబట్టి అక్కడే ఉన్నానని, అందుకే హైదరాబాద్లోని క్వార్టర్స్ వద్ద ఏసీబీ నోటీసులు అంటించిన విషయం తెలియదని ఆయన అన్నారు.
మీడియా ద్వారా తనకు విషయం తెలియడంతో.. ఏసీబీకి లేఖ రాసినట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత ఏసీబీ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. తర్వాత తానే మళ్లీ విచారణకు సిద్దంగా ఉన్నట్లు రెండోసారి లేఖ రాశానని చెప్పారు. రెండోసారి నోటీసులు ఇచ్చిన సమయానికి తాను విచారణకు హాజరయ్యానని, సోమవారం నాడు 8 గంటల పాటు ఏసీబీ అధికారులు సాగించిన విచారణలో అన్ని విషయాలను వెల్లడించానని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. తనను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని, అయితే ఈ కుట్రలకు భయపడేది లేదని ఆయన అన్నారు. టీఆర్ఎస్కు కేవలం 63 మంది మాత్రమే ఎమ్మెల్యేలుండగా, వాళ్లు 84 మంది ఎలా అయ్యారని ప్రశ్నించారు. సరైన బలం లేని టీఆర్ఎస్ అసలు ఎన్నికల బరిలోకి ఎలా దిగిందని అడిగారు. తాను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని చెప్పారు.