
'మా అమ్మను భారత్‌లో జడ్జి కానివ్వలేదు'
న్యూయార్క్: భారత్‌లో తన తల్లి న్యాయశాస్త్రాన్ని చదివి లాయర్ అయినా.. అప్పుడున్న పరిస్థితులు ఆమె న్యాయమూర్తి (జడ్జి)ని కానివ్వలేదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హెలీ గుర్తుచేసుకున్నారు. భారత సంతతికి చెందిన ఆమె బుధవారం ఐరాసలో అంతర్జాతీయ సంబంధాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళల పాత్ర గురించి ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ.. 'నేను మహిళలకు పెద్ద అభిమానిని. వారు చేయలేనిదంటూ ఏమీ లేదు. మహిళల పురోగతికి కృషి చేసే ఏ ప్రజాస్వామ్యమైనా.. దానివల్ల అధికంగా లబ్ధి పొందుతుంది' అని పేర్కొన్నారు. భారత్‌లో తన తల్లి జీవితాన్ని ఆమె ఈ సందర్భంగా వివరించారు.
'భారత్‌లో పెద్దగా చదువుకొనే అవకాశం లేకపోయినప్పటికీ మా అమ్మ లా స్కూల్‌కు వెళ్లి విద్యాభ్యాసం చేసింది. భారత్‌లో తొలి మహిళా న్యాయమూర్తిగా ఆమెకు అవకాశం లభించి ఉండేది. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల ఆమె న్యాయమూర్తిగా ధర్మాసనంలో కూర్చోలేకపోయింది. కానీ తన కూతురే ఇప్పుడు సౌత్ కరోలినా గవర్న్‌ర్ కావడం, ఐరాసకు అమెరికా రాయబారి కావడం ఆమెకు ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోండి' అని నిక్కీ పేర్కొన్నారు. నిక్కీ హెలీ అజిత్ సింగ్ రాంధావ, రాజ్ కౌర్ రాంధావ దంపతులకు జన్మించారు. ఆమె మొదటి పేరు నిమ్రత రాంధావ. 1960లో ఆమె కుటుంబం మొదట కెనడాకు, ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లిపోయింది.
నిజానికి, భారత తొలి మహిళ జడ్జిగా జస్టిస్ అన్నా చాందీ కీర్తి గడించారు. ఆమె తొలి మహిళ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా నియమితులయ్యారు. 1937లోనే ఆమె ట్రావెన్‌కోర్ మునసబు (న్యాయాధికారి)గా నియమితులయ్యారు.