నా కుమారుడు అమాయకుడు
ఇదంతా జగన్ కుట్ర: ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు రావెల సుశీల్ అమాయకుడని, ఏ తప్పూ చేయలేదని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు పేర్కొన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కొంతమంది వ్యక్తుల ఒత్తిడితోనే కేసు మార్చారని పోలీసులను తప్పుపట్టారు. మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ధర్మ, న్యాయ పోరాటం చేస్తామన్నారు. తన కుమారుడు నిర్దోషిగా బయటకి వస్తాడని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న తమను ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లక్ష్యంగా చేసుకున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తోందన్నారు. జగన్ నియంతృత్వ ధోరణి వల్లే వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారన్నారు. ప్రభుత్వంపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఆయన అయోమయ స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. తమను విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న జగన్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ముద్రగడ పద్మనాభం, మంద కృష్ణ మాదిగలను ప్రోత్సహిస్తున్న జగన్‌ను ప్రజలు తిరస్కరిస్తారని రావెల వ్యాఖ్యానించారు. ఖబడ్దార్ జగన్! నీ ఆటలు సాగనివ్వం.. ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు.
సుశీల్ నిర్దోషిగా బయటకు వస్తాడు
‘‘నా కుమారుడు సుశీల్ నిర్దోషి. అతడిపై తప్పుడు కేసులు బనాయించారు. రాజకీయంగా ఎదుర్కోలేక నా కుమారుడి జీవితంతో ఆడుకుంటున్నారు. సుశీల్‌ను లేనిపోని కేసుల్లో ఇరికించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. దళిత విద్యార్థి జీవితంతో ఆడుకునే నీచ రాజకీయాలకు దిగజారుతున్నారు. ఓ యువతిని వేధించారంటూ.. వేరే వీడియో పుటేజీ తీసుకొచ్చి నా కుమారుడు తప్పుచేసినట్లు చిత్రీకరిస్తున్నారు. మొదటి ఎఫ్‌ఐఆర్‌లో నా కుమారుడి పేరు లేదు. తర్వాత పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారు. చేయి పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడని మాత్రమే ఫిర్యాదులో ఉంది. వీడియో పుటేజీని మార్ఫింగ్ చేసి నా కుమారుడిని కేసులో ఇరికించారు. ఈ విషయంలో మీడియా ద్వారా జగన్ మైండ్‌గేమ్ ఆడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టించడానికి వైఎస్సార్‌సీపీ కుట్ర చేసింది. న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. ఈ కేసు నుంచి సుశీల్ నిర్దోషిగా బయటకు వస్తాడు’’ అని మంత్రి రావెల స్పష్టం చేశారు. మీడియా వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వకుండా సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు.