కేసీఆర్ ప్రభుత్వం దారి తప్పింది : నాగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం దారితప్పిందని, ప్రభుత్వాన్ని సరిచేయడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరుపై ప్రజలను సమీకరించి, ప్రజల కోసం ప్రభుత్వాన్ని పని చేయించడమే బచావో తెలంగాణ మిషన్ లక్ష్యమని చెప్పారు. రాజకీయాల్లో తన 30 ఏళ్ల అనుభవాన్ని వినియోగించుకున్న పాపాన పోలేదని బీజేపీనీ విమర్శించారు.
హైదరాబాద్‌లో బుధవారం ‘బచావో తెలంగాణ మిషన్’ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగం మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులపై ఉద్యమంతో ప్రారంభమైన బచావో తెలంగాణ మిషన్ భవిష్యత్తులో విద్య, వైద్యం, యువజన సమస్యలపై పోరాడుతుందన్నారు. అవగాహనలేని నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారని ఆరోపించారు. తమ మిషన్ బీజేపీకి వ్యతిరేకం కాదని, ప్రస్తుతానికి ఆ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు.