
గోళ్ల మెరుగుతో లైంగిక దాడికి చెక్!
హూస్టన్: మహిళలు అందం కోసం తమ చేతివేళ్ల గోళ్లకు రకరకాల రంగుల్లో మెరుగు(పాలిష్) పెట్టుకుంటుంటారు. అయితే తాము తయారు చేసిన పాలిష్‌ను వాడితే అందం పెరగడమే కాదు.. లైంగిక దాడి ప్రమాదాన్ని కూడా పసిగట్టవచ్చని అంటున్నారు అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులు. ‘అండర్‌కవర్ కలర్స్’ అనే తమ నెయిల్ పాలిష్ శీతల పానీయాల్లో కలిపిన మత్తుమందులను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని యూనివర్సిటీకి చెందిన భారతీయ అమెరికన్ విద్యార్థి అంకేశ్ మదన్‌తో సహా నలుగురు అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు చెబుతున్నారు. కూల్‌డ్రింకులో వేలు ఉంచి దానిని కలిపితే చాలు.. అందులో ఏవైనా తీవ్ర మత్తు కలిగించే డ్రగ్స్ వంటివి ఉంటే వెంటనే నెయిల్ పాలిష్ రంగు మారిపోతుందని, దానిని బట్టి లైంగిక దాడి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తప్పించుకోవచ్చని వారు అంటున్నారు.
కూల్‌డ్రింకుల్లో కలిపి అత్యాచారాలు చేసేందుకు ఎక్కువగా ఉపయోగించే రోహిప్నాల్, జానాక్స్, గామా హైడ్రాక్సీబ్యుటిరిక్ యాసిడ్ వంటి డ్రగ్స్ తగలగానే రంగు మారిపోయేలా వారు ఈ పాలిష్‌ను తయారు చేశారు. తమ నలుగురికీ తెలిసిన కొందరు మహిళలు పానీయాల్లో మత్తుమందులు కలిపి ఇవ్వడం వల్లే లైంగిక దాడికి గురయ్యారని, అందుకే మహిళల రక్షణ కోసం దీనిని రూపొందించినట్లు వారు చెప్పారు. వినూత్నమైన వీరి ఆవిష్కరణకు ‘కే50 స్టార్టప్ షోకేస్’లో లక్ష డాలర్లు(రూ.60 లక్షలు), నార్త్ కరోలినా స్టేట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇనీషియేటివ్ నుంచి మరో 11 వేల డాలర్ల (రూ. 6.80 లక్షలు) బహుమతి కూడాదక్కింది.