నానా పాటేకర్.. నాలుగు మాటలు
నానా పాటేకర్.. నాలుగు మాటలు
Published Wed, Nov 16 2016 2:31 PM | Last Updated on Thu, Sep 27 2018 9:11 PM
బాలీవుడ్‌లో విలక్షణ నటులు చాలామందే ఉన్నారు. వాళ్లందరిలోకీ కూడా విలక్షణమైన వ్యక్తి నానా పాటేకర్. నూటికి నూరుపాళ్లు తాను చెప్పేది ఆచరించే మనిషి ఆయన. వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లోపాల మీద కూడా ఆయన చేసే పోరాటం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అవే విషయాలను చాలాసార్లు సినిమాల్లో తన పాత్రల ద్వారా కూడా చెబుతారు. అలాంటి నానా.. జమ్ము కశ్మీర్‌లోని యువతను బుధవారం కలిశారు. వాళ్లతో మాట్లాడారు. ఆర్మీ జవాన్లతో కలిసి యువతీ యువకులను కలిసిన నానా.. వాళ్లకు నాలుగు మంచి మాటలు చెప్పారు. యువత ముందుగా చదువుకోవాలని, ప్రధాన స్రవంతిలోకి రావాలని సూచించారు. చదువుకుంటేనే ఏమైనా సాధ్యమవుతుందని, బాగా పైకొచ్చి దేశాన్ని కూడా అభివృద్ధి చేయాలని తెలిపారు. అంతేతప్ప.. ఇలా చేస్తే మాత్రం (రాళ్లు రువ్వడం) జీవితంలో ఏమీ సాధించలేరని చెప్పారు. అసలు ముందు ఈ దేశాన్ని మీది అనుకుంటే, ఆ తర్వాత అన్నీ చాలా సులభం అవుతాయని అన్నారు.
సైనికుల స్ఫూర్తి భేష్
తాను ఇక్కడికి సైనికుల మనోధైర్యం పెంచడానికి రాలేదని, వాళ్లే తనకు బోలెడంత స్ఫూర్తినిచ్చారని అన్నారు. వాళ్లను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. హోలీ, దీపావళి.. ఏ పండుగైనా వాళ్లకు మాత్రం లేదని, అయినా చాలా సంతోషంగా ఉన్నారని నానా అన్నారు. వాళ్లకు కనీసం సెలవులు కూడా లేవని చెప్పారు. కతువా సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకుంటూ ప్రాణాలు కోల్పోయిన గుర్నామ్ సింగ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
నోట్ల రద్దు మంచిదే..
పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని నానా ప్రశంసించారు. ఇన్ని సంవత్సరాల బట్టి మనం చాలా భరిస్తూ వచ్చామని.. ఈ పది, ఇరవై రోజుల కష్టాన్ని భరించలేమా అని ప్రశ్నించారు.
Advertisement
Advertisement