కాల్‌సెంటర్ స్కామ్ 2 వేల కోట్లపైనే
► అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడి
► ఎఫ్‌బీఐ అదుపులో హైదరాబాదీ భోగవల్లి నరసింహ
► టెక్సాస్ రాష్ట్రం ఇర్వింగ్‌ను చిరునామాగా పేర్కొన్న భోగవల్లి
► ఐఆర్‌ఎస్ ఏజెంట్ల పేరిట బెదిరింపులు, ఆపై వసూళ్లు
► అతని ఖాతాల్లో కోట్లు జమచేసిన అమెరికన్లు
► నగదును భారత్‌కు బదిలీ చేశాడంటూ ఎఫ్‌బీఐ అభియోగాలు
వాషింగ్టన్, డల్లాస్: భారత్ కేంద్రంగా సాగిన కాల్‌సెంటర్ కుంభకోణం విలువ రూ. 2 వేల కోట్లకు పైనేనని అమెరికా అధికారులు నిర్ధారించారు. ఐదు కాల్ సెంటర్లు వేలాది మంది అమెరికా పౌరులను మోసం చేసి ఈ మొత్తాన్ని అక్రమంగా వసూలు చేశాయని, దొంగిలించాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ జే జాన్సన్ తెలిపారు. ఈ కేసులో ఇంతవరకూ అమెరికాలో 20 మంది అరెస్టు కాగా, అందులో భారతీయులే అధికంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. హెచ్ గ్లోబల్, కాల్‌మంత్ర, వరల్డ్‌వైడ్ సొల్యూషన్స్, జోరియన్ కమ్యూనికేషన్స్, శర్మ బీపీవో సర్వీసెస్ పేరుతో కాల్‌సెంటర్ల నుంచి ఈ ఫోన్‌కాల్స్ వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేశాయి.
మరోవైపు ఈ కుంభకోణంలో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. కీలక సూత్రధారుల్లో ఒకరైన హైదరాబాద్‌కు చెందిన భోగవల్లి నరసింహ(50)ను ఎఫ్‌బీఐ అధికారులు గురువారం అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా నగదు కార్యకలాపాలు నిర్వహించాడంటూ ఎఫ్‌బీఐ అతనిపై కేసు నమోదు చేసి టెక్సాస్ రాష్ట్రం నార్తర్న్ జిల్లా మెజిస్ట్రేట్ న్యాయమూర్తి ముందు హాజరుపర్చింది. ఈ మేరకు నార్తర్న్ జిల్లా అటార్నీ శుక్రవారం ప్రకటన విడుదలచేశారు.
ఎఫ్‌బీఐ వెల్లడించిన వివరాల మేరకు... అమెరికాకు చెందిన ఆదాయపు పన్ను వసూలు విభాగం ఐఆర్‌ఎస్(ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్) ఏజెంట్లుగా పేర్కొంటూ కొందరు వ్యక్తులు అమెరికాలో పలువురికి ఫోన్లు చేసి బెదిరించారు. పన్ను చెల్లింపుల్లో లొసుగులున్నాయని, అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయంటూ భయపెట్టేవారు. జరిమానా చెల్లించకపోతే జైలుకు పంపుతామంటూ ఐఆర్‌ఎస్ పేరిట హెచ్చరించారు. మనియార్డర్లు, నగదును తాము పేర్కొన్న బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలంటూ వందలాది మందిని మోసగించారు. ఈ బ్యాంకు ఖాతాల్లో కొన్నింటిని భోగవల్లి నియంత్రించేవాడని ఎఫ్‌బీఐ వెల్లడించింది. వెంటనే ఐఆర్‌ఎస్‌కు డబ్బు చెల్లించకపోతే... గంటల వ్యవధిలో అరెస్టు చేస్తామని హెచ్చరించి కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బును భోగవల్లి హవాలా మార్గంలో భారత్‌కు పంపేవాడు.
మోసంలో మూడు ఖాతాల వినియోగం
బ్యాంక్ ఆఫ్ అమెరికాకు చెందిన రెండు ఖాతాల్ని ఈ మోసంలో భోగవల్లి వినియోగించాడు. అందులో ఒకటి టెక్‌డైనమిక్స్ ఇండస్ట్రీస్ పేరిట, రెండోది టచ్‌స్టోన్ కమోడిటీస్ ఇండస్ట్రీస్ పేరిట ఉంది. భోగవల్లి వాడిన ఇతర ఖాతాల్లో టచ్‌స్టోన్ కమోడిటీస్ పేరిట ఉన్న సిటీ బ్యాంకు అకౌంట్ కూడా ఉంది. నవంబర్ 5, 2014– ఫిబ్రవరి 2, 2015 మధ్య దాదాపు 242 సార్లు భోగవల్లికి చెందిన బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాకు నగదు జమైనట్లు గుర్తించారు. వాటి మొత్తం విలువ రూ. 11.29 కోట్లు. ఈ మొత్తంలో 2,250 ప్రత్యేక మనియార్డర్లు కూడా ఉన్నాయి. అలాగే జనవరి 16, 2015–జనవరి 30, 2015 మధ్య దాదాపు 60 మనియార్డర్లు (రూ. 25.81 లక్షలు) మరో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాలో జమయ్యాయి. నవంబర్ 4, 2014– ఫిబ్రవరి 5, 2015 మధ్యలో దాదాపు 128 మనియార్డర్లు (రూ.65.76 లక్షలు) సిటీ బ్యాంక్ ఖాతాకు చేరాయి. ఈ ఖాతాల్లో నగదును భోగవల్లి... తన నియంత్రణలోని ఇతర ఖాతాలకు బదిలీ చేసేవాడు. వాటిని ఖర్చుపెట్టడం లేదా భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఖాతాలకు బదిలీ చేసేవాడు.
రెండు కంపెనీలకు అధినేతగా భోగవల్లి
రికార్డుల ప్రకారం భోగవల్లి టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్ పట్టణం చిరునామాతో టచ్‌స్టోన్ కమోడిటీస్‌కు డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. టచ్‌స్టోన్ కమోడిటీస్ ద్వారా ఎగుమతులు, దిగుమతులు వ్యాపారం చేస్తున్నట్లు వెబ్‌సైట్‌లో అతను పేర్కొన్నాడు. టెక్‌డైనమిక్స్ వెబ్‌సైట్ ప్రకారం... ఆ సంస్థకు అధ్యక్షుడు భోగవల్లే... టెక్నాలజీ, అవుట్‌సోర్సింగ్, కన్సల్టింగ్ సేవల్ని అందిస్తామంటూ అందులో పేర్కొన్నాడు. అందులోను ఇర్వింగ్ పట్టణం చిరునామానే ఇచ్చాడు.