గ్రహాల బొనాంజా!
వాషింగ్టన్: మన సౌర కుటుంబం వెలుపల భూమి లాంటి గ్రహాల కోసం అన్వేషిస్తున్న నాసా కెప్లర్ టెలిస్కోపు మరో 715 కొత్త గ్రహాలను గుర్తించింది. దీంతో ఇప్పటిదాకా గుర్తించిన అధిగ్రహాల (సౌరకుటుంబం వెలుపలి గ్రహాలు) సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యి 1,700కు చేరుకుంది. బహుళ గ్రహ వ్యవస్థతో కూడిన నక్షత్రాలను పరిశీలించిన కెప్లర్ టెలిస్కోపు మే 2009 నుంచి మార్చి 2011 మధ్యలో అందించిన సమాచారం ఆధారంగా నాసా శాస్త్రవేత్తలు ఈ గ్రహాలను కనుగొన్నారు. 305 నక్షత్ర వ్యవస్థల్లో ఉన్న ఈ కొత్త గ్రహాల్లో 95 శాతం గ్రహాలు భూమి కన్నా నాలుగు రెట్లు పెద్దది అయిన నెప్ట్యూన్ కన్నా కొంచెం చిన్నగా ఉన్నాయట. కెప్లర్ టెలిస్కోపు ఇప్పటిదాకా 1,50,000 నక్షత్రాలను పరిశీలించింది.
అందులో కొన్ని వేల నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని, వాటిలో ఒకటి కన్నా ఎక్కువ గ్రహాలు ఉన్న నక్షత్రాలు వందలాదిగా ఉన్నాయని గుర్తించింది. తాజాగా గుర్తించిన అధిగ్రహాల్లో నాలుగు గ్రహాలు భూమి కన్నా రెండున్నర రెట్ల సైజులోపే ఉన్నాయని, అవి భూమి మాదిరిగానే తమ నక్షత్రాలకు ఆవాసయోగ్యమైన ప్రాంతంలోనే తిరుగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిలో కెప్లర్-296ఎఫ్ అనే గ్రహంపై హైడ్రోజన్-హీలియం వాయువులతో కూడిన పొర లేదా చుట్టూ అత్యంత లోతైన సముద్రం ఆవరించి ఉండవచ్చని అంచనావేశారు.