ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు
ఆయన సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి. కానీ, ఆయనే తనపై పదేపదే పలుమార్లు అత్యాచారం చేశారంటూ ఓ మహిళ వాపోయింది. మహారాష్ట్రలో ఎన్సీపీ ఎమ్మెల్యే అయిన లక్ష్మణరావు ధబోలే మీద ఈ మేరకు కేసు నమోదైంది. షోలాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయనపై ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 323 (గాయపరచడం), 506 (బెదిరించడం) కింద బోరివాలి స్టేషన్లో కేసులు నమోదైనట్లు డీసీపీ బల్సింగ్ రాజ్పుత్ తెలిపారు.
ధబోలేకు బాగా తెలిసిన కాలేజీలో పనిచేసే బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు శుక్రవారం నాడు ఫిర్యాదు చేసింది. గతంలో మహారాష్ట్రకు మంత్రిగా కూడా పనిచేసిన ధబోలే.. ఈ అత్యాచారాల గురించి ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమెను హెచ్చరించారని, ఆమెను అభ్యంతరకర రీతిలో ఫొటోలు తీసి వాటిని బయట పెడతానని కూడా అన్నారని పోలీసులు తెలిపారు.