కీలక భేటీకి ఎన్‌సీపీ డుమ్మా
న్యూఢిల్లీ: పాలక బీజేపీపై సమైక్య పోరాటాలకు పదును పెట్టేందుకు కార్యాచరణ కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కీలక భేటీకి ఎన్‌సీపీ హాజరుకాకపోవడం విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీకి దగ్గరవుతారా అనే ఆందోళన ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతున్నది.ఉత్కంఠ రేపిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ విజయం సాధించడం విపక్షాల్లో నైతిక స్థైర్యం నింపిన క్రమంలో తాజాగా ఎన్‌సీపీ వైఖరి నిరాశపరిచింది. పాలక బీజేపీపై రానున్న రోజుల్లో భావసారూప్యత కలిగిన పార్టీలతో సమన్వయంతో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టే అధికారాన్ని 16 విపక్ష పార్టీల నేతలు కట్టబెట్టారు.
కాంగ్రెస్ అధిన్రేతి సోనియా గాంధీకి కట్టబెడుతూ ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇక గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్‌సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో కేవలం ఒక సభ్యుడే కాంగ్రెస అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు ఓటు వేయడం, తాజా భేటీకి ఎన్‌సీపీ దూరం కావడం వంటి పరిణామాలతో ఇరు పార్టీల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయని భావిస్తున్నారు. ఇక విపక్షాల భేటీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే వరకూ ప్రభుత్వంపై సమిష్టి కార్యాచరణతో పోరాటాలు చేపట్టాలని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సూచించారు. బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఆందోళనల్లో విపక్షాలు పాలుపంచుకోవాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించారు.