ఎన్డీఏకు ‘పెద్ద’ సవాలే | NDA govt passes ordinance to ease land acquisition | Sakshi
Sakshi News home page

ఎన్డీఏకు ‘పెద్ద’ సవాలే

Published Thu, Feb 19 2015 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

ఎన్డీఏకు ‘పెద్ద’ సవాలే

ఎన్డీఏకు ‘పెద్ద’ సవాలే

పార్లమెంటు ముందుకు రానున్న 8 ఆర్డినెన్సులు  రాజ్యసభలో మెజారిటీ లేని ఎన్డీఏ
 
16వ లోక్‌సభ తొలి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు మోదీ సర్కారుకు సవాలుగా మారాయి. ఎన్డీఏ సర్కారుకు బడ్జెట్ ప్రవేశపెట్టడం కంటే కూడా పది రోజుల వ్యవధిలో ఒకదాని వెంట ఒకటిగా తీసుకువచ్చిన ఎనిమిది కీలకమైన ఆర్డినెన్సులను  ఆమోదింప చేసుకోవటం పెద్ద సమస్య.  నిబంధనల ప్రకారం పార్లమెంటు సమావేశాలు మొదలైన 42 రోజుల్లోగా  ఆర్డినెన్సులు చట్టరూపం దాల్చాలి. లేని పక్షంలో అవి
 రద్దవుతాయి. రాజ్యసభలో మద్దతు లేకపోవటంతో కీలకమైన భూసేకరణ ఆర్డినెన్సుకు చట్టరూపం తేవటం కోసం ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఆమోదింపజేసుకోవటం మినహా ఎన్డీఏ ముందు ప్రత్యామ్నాయం లేదు.  మొత్తమ్మీద ఈనెల 23 నుంచి మొదలుకానున్న పార్లమెంట్ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగనున్నాయి.
- నేషనల్ డెస్క్
 
భూసేకరణ, బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితి పెంపు, బొగ్గు గనులకు ఇ-వేలం, గనులు, ఖనిజాలకు వేలం ద్వారా లెసైన్సులు ఇవ్వటం(ఎంఎండీఆర్), భారతి సంతతి పౌరులు(పీఐఓ), అంతర్జాతీయ భారత పౌరసత్వా(ఓసీఐ)లను విలీనం చేసి పీఐఓలకు జీవిత కాలపు వీసా ఇవ్వటం, ఢిల్లీలో అక్రమ కాలనీల క్రమబద్ధీకరణ, రాజధానిలో ఈ-రిక్షాలకు అనుమతి వంటి   కీలకాంశాలపై ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు జారీ చేయటం వివాదాస్పదమైంది. వీటిలో ఢిల్లీలో అక్రమ కాలనీల క్రమబద్ధీకరణ, ఈ-రిక్షాల ఆర్డినెన్సులు రాజధాని అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చినవే. ఈ రెండు ఆర్డినెన్సులు బీజేపీకి ఎన్నికల్లో ఎలాంటి లాభాన్ని చేకూర్చలేకపోయాయి.  ఎలాగూ రాజకీయ ప్రయోజనాలు నెరవేరలేదు కాబట్టి ఇక ఇప్పుడు ఈ ఆర్డినెన్సులను అత్యవసరంగా చట్టరూపంలోకి తీసుకురావలసిన తప్పనిసరి పరిస్థితి ప్రభుత్వానికి లేదు. పీఐఓలకు శాశ్వత వీసా అంశంపైనా ప్రతిపక్షాలకు పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ, ప్రధానమైన నాలుగు ఆర్డినెన్సులకు పార్లమెంటు ఆమోదముద్ర వేయించుకోవటం ప్రధాని మోదీ టీమ్‌కి సమస్యే.
 
భూసేకరణపై రచ్చ రచ్చే..
 
అన్నింటికంటే ముఖ్యమైంది భూ సేకరణ ఆర్డినెన్సు.  ఈ వ్యవహారం ఇప్పటికే ఎన్డీఏ సర్కారును రచ్చకీడ్చింది. వివిధ రంగాల అభివృద్ధికి భూములను సేకరించే సందర్భంలో రైతుల అనుమతి అక్కర్లేదంటూ తెచ్చిన ఆర్డినెన్సు.. రైతు హక్కులను కాలరాసేలా ఉందంటూ విపక్షాలు ఆర్డినెన్సు వచ్చిన రోజు నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  జాతీయ భద్రత, రక్షణ విభాగం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, సామాజిక మౌలిక సదుపాయాల వంటి అయిదు రంగాలలో భూసేకరణ విషయంలో రైతుల అనుమతిని ఈ ఆర్డినెన్సు మినహాయించింది. 2013లో యూపీఏ సర్కారు తెచ్చిన చట్టంలో రైతులకు ఉన్న కనీస రక్షణలనూ ఈ ఆర్డినెన్సు కాలరాసిందనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. 1894కంటే ఘోరమైన పరిస్థితిని మోదీ సర్కారు రైతులకు కల్పిస్తోందని అన్ని పార్టీలూ ఆరోపిస్తున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి నాటి నుంచే దీనిపై దుమారం రేగటం ఖాయం. దాదాపు అన్ని విపక్షాలు ఏకమై గళం విప్పనున్నాయి. తాను తెచ్చిన చట్టానికి ఎన్డీఏ సర్కారు తూట్లు పొడవటంపై కాంగ్రెస్ మండిపడుతోంది. రైతులతో ముడిపడిన అంశం కావటంతో కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలకూ ఇదే బ్రహ్మాస్త్రం కానుంది. అంతే కాకుండా సమావేశాలు ప్రారంభమైన మర్నాటి నుంచి అన్నాహజారే సైతం భూసేకరణ చట్ట సవరణపైనే రాజధానిలో దీక్షకు సిద్ధం కావటం మోదీ సర్కారును కచ్చితంగా ఇరుకున పెట్టే అంశమే. అన్నాకు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం బహిరంగంగానే మద్దతును ప్రకటించే అవకాశాలుండటంతో ఈ అంశంపైనే బడ్జెట్ సమావేశాలు ఆధారపడి ఉన్నాయి.
 
బొగ్గుకు చిక్కులు

 
బొగ్గు బ్లాకులపై తెచ్చిన ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో తీసుకురాకుంటే వేలంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీనిపై కేంద్ర మంత్రులు ఇప్పటికే చర్చించారు. కోల్‌స్కాంలో 214 లెసైన్సులను సుప్రీం కోర్టు రద్దు చేయటంతో, ఈవేలం ద్వారా కేటాయింపులు చేసే అవకాశం కల్పిస్తూ కేంద్రం ఆర్డినెన్సును తీసుకువచ్చింది.  కానీ దీంతో కూడా అక్రమార్కులకే అవకాశం కల్పించినట్లవుతుందని విపక్షాల వాదన. ఈ ఆర్డినెన్స్ మార్చి 20నాటికి ఆమోదం పొందాలి. లేదంటే రద్దయిపోతుంది.

బీమా రంగం 

బీమాపై ధీమా..లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49శాతానికి పెంచుతూ ఎన్డీఏ సర్కారు తెచ్చిన ఆర్డినెన్సుకు కాంగ్రెస్ ఒక విధంగా మద్దతు తెలపవచ్చు. ఎందుకంటే ఈ ప్రతిపాదన గతంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం తెచ్చినదే.  ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఎన్డీఏకు మెజారిటీ ఉండటంతో తేలిగ్గా ఆమోదం పొందింది. రాజ్యసభలో మాత్రం విపక్షాల డిమాండ్ మేరకు పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు వెళ్లింది. అయితే, ఈ అంశాన్ని వామపక్ష  ఫ్రంట్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సెలెక్ట్ కమిటీ సిఫారసు వచ్చాక దానిపై రాజ్యసభలో చర్చ జరగాల్సి ఉంది. విపక్షాల డిమాండ్ మేరకే సెలెక్ట్ కమిటీకి వెళ్లింది కాబట్టి, దాని సిఫార్సులకు అంగీకరిస్తే బిల్లు ఆమోదం సమస్య కాకపోవచ్చు.  
 
గనులకు ‘ఎర్ర’లైట్


గనులు, ఖనిజాల ఆర్డినెన్స్ పరిస్థితి కూడా విపక్షాల మద్దతుపైనే ఆధారపడి ఉంది. పలు రాష్ట్రాల్లో ఖనిజాలు, గనుల తవ్వకాలకు సంబంధించి ప్రజల హక్కులను కాలరాస్తున్నారన్న కారణంతోనే ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్యం పెరిగింది. ఇప్పుడు వేలం ద్వారా లెసైన్సులు జారీ చేయటం అన్నది సంపన్నులకు ఖనిజ సంపద కట్టబెట్టడమేనన్నది విపక్షాల వాదన. వామపక్షాల నుంచి ఈ ఆర్డినెన్సుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 
‘సంయుక్తం’ ఇప్పటికి మూడుసార్లే
 
పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాలు పెట్టి బిల్లులకు ఆమోదం పొందిన సందర్భాలు స్వతంత్ర భారత్‌లో మూడే ఉన్నాయి. మొదటిసారి 1961 మే 9న ‘వరకట్న నిరోధక చట్టం’ సంయుక్త సమావేశంలో గట్టెక్కింది. రెండోసారి ‘బ్యాంకింగ్ సర్వీసు కమిషన్ రద్దు బిల్లు’ 1978 మే 16న ఆమోదం పొందింది. చివరిసారిగా వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా... 2002 మార్చి 26న ‘పోటా’ చట్టం ఆమోదముద్ర వేసుకుంది.
 
 ఏయే సందర్భాల్లో పిలవొచ్చు


ఆర్టికల్ 108 ప్రకారం రాష్ట్రపతి 3 సందర్భాల్లో ఉభయసభల సంయుక్త సమావేశాన్ని పిలవొచ్చు. 1.ఏదేని బిల్లును ఒక సభ ఆమోదించి... మరో సభ తిరస్కరించినప్పుడు. 2. ఒక బిల్లుకు చేసిన సవరణలపై ఇరుసభల మధ్య ఏకాభిప్రాయం లేనప్పుడు. 3. ఒక బిల్లు ఏదేని సభకు చేరి ఆరునెలలు దాటినా ఆమోదం పొందనప్పుడు.
 
ఏయే బిల్లులకు...?


భూసేకరణ, బొగ్గు గనుల కేటాయింపు బిల్లుల ఆమోదానికి తప్పనిసరిగా ఉభయసభల సమావేశం పెట్టాల్సి రావొచ్చు. ఎందుకంటే భూసేకరణ బిల్లులో తెచ్చిన మార్పులు ప్రజల భూయాజమాన్య హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని విపక్షాలన్నీ ధ్వజమెత్తుతున్నాయి. దీన్ని సమర్థించేటపుడు ఎన్‌డీఏలోని బీజేపీ మిత్రపక్షాలు కూడా ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఉంటుంది.
 
విమర్శలకు ఆస్కారం..

ఏదేని ఒక సభలో అధికారపక్షం సంఖ్యాబలంతో సరైన చర్చ లేకుండా ఏదేని బిల్లును హడావుడిగా ఆమోదింపజేసుకునే అవకాశముంటుందని, అలాకాకుండా చట్టాలపై కూలంకషంగా చర్చ జరగాలనే ఉద్దేశంతోనే మనం ఉభయసభల విధానాన్ని ఎంచుకున్నాం. ఏదేని సభ ఒక బిల్లును అడ్డుకున్నపుడు అఖిలపక్షాన్ని పిలిచి దేశప్రయోజనాలు, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆ బిల్లు ఎంత అవసరమో వివరించి... వారిని ఒప్పించాలి. అలాకాకుండా సంయుక్త సమావేశం పెట్టి సంఖ్యాబలం సాధించడమనేది మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే విమర్శలున్నాయి.
 
 కలిపి కూర్చోబెట్టినా అంతంతే!

సంయుక్త సమావేశం పెట్టినా బిల్లులు గట్టెక్కడం అంత సులభమేమీ కాదు. బొటాబొటి మెజారిటీతో బయటపడతాయి. లోక్‌సభలో 543, రాజ్యసభలో 241 (నాలుగు ఖాళీలున్నాయి) కలిపితే 784 అవుతుంది. ఇందులో మెజారిటీ అంటే 393 ఓట్లు పడాలి. ఎన్‌డీఏకు ఉభయసభల్లో కలిపి 399 మెజారిటీ ఉంది (ఎన్‌డీఏకు అన్నా డీఎంకే మద్దతుగా నిలుస్తుందని భావించి లెక్క వేసిన పక్షంలో). అయితే ఇటీవలి కాలంలో బీజేపీతో శివసేన (ఉభయసభల్లో కలిపి 21 మంది సభ్యుల బలముంది) సంబంధాలు అంత సజావుగా లేకపోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement