తలనీలాలు కొట్టేశారట..!
తలనీలాలకు ఎంత డిమాండ్ పెరిగిందో చూడండి.. సాధారణంగా ఏ గుడిలోనైనా దేవుడి బంగారమో లేక హుండిలోని డబ్బో దొంగలు దోచుకెళ్లే సందర్భాలు చూస్తుంటాం. కానీ మార్కెట్ లో కోట్ల రూపాయలకు పలికే జుట్టుకున్న డిమాండ్ ను గమనించారో ఏమోగానీ. విలువైన వస్తువులను పక్కనబెట్టి మరీ జుట్టుపైనే కన్నేశారు. తమిళనాడులో ఓ గుడిలో దేవుడికి సమర్పించిన తలనీలాలను దొంగతనం చేశారు. ఏకంగా 800 కేజీల జుట్టును దొంగలు ఎత్తుకుపోయారు. దేవాలయాల్లో భక్తుల తలనీలాల కున్న విలువను గుర్తించిన దొంగలు సుమారు రూ.45లక్షల విలువచేసే జుట్టును అపహరించుకుపోయారు.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో మారియమ్మన్ దేవాలయంలో ఈ చోరీ జరిగింది. దేవుడికి సమర్పించిన తల నీలాలను ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. నిన్న(శుక్రవారం) ఉదయం ఆలయాన్ని తెరిచినప్పుడు ఈ విషయాన్ని గుర్తించానని గుడి పూజారి ఫిర్యాదుతో ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది.
సాతూర్ సమీపంలోని ఇరుక్కంకుడి గ్రామంలో ఉన్న 400 ఏళ్ల మారియమ్మన్ గుడికి పూజారిగా ఉంటున్న ఎన్ రామస్వామి ఫిర్యాదుతో రూ.45లక్షల విలువచేసే జుట్టును దోచుకెళ్లారని ఆయన ఫిర్యాదుచేశారు. గత మూడేళ్లుగా భక్తులు సమర్పించుకున్న తలనీలాలను మూడు గదుల్లో భద్రపరిచామని, ప్రస్తుతం ఆ జుట్టను వేలం కోసం సిద్ధంచేస్తున్నట్టు తెలిపారు. మూడేళ్ల క్రితం జరిపిన వేలంలో తలనీలాల ద్వారా గుడికి రూ.3.33 కోట్ల ఆదాయం సమకూరినట్టు రామమూర్తి ఫిర్యాదులో పేర్కొన్నారు.
గుడిలకు వచ్చే భక్తులు తమ మొక్కులు తీరినందుకు తల నీలాలను సమర్పించుకుంటుంటారు. తిరుపతిలో భక్తులు ఎక్కువగా తల నీలాలు సమర్పించుకోవడం చూస్తుంటాం. మొక్కులుగా వచ్చిన ఆ జుట్టును యూరప్, ఆసియా వంటి దేశాలకు విగ్ లకు కోసం ఎగుమతి చేస్తుంటారు. తిరుపతిలో భక్తులు మొక్కులుగా సమర్పించిన తలనీలాలను ఆన్ లైన్ లోనే వేలం వేస్తుంటారు. అయితే తమిళనాడు, మిగతా ప్రాచీన ఆలయాల్లో ఆ జుట్టును పురాతన ఆచారం ప్రకారమే వేలం వేస్తున్నారు.