
‘నేను శక్తి’. స్త్రీలు తరతరాల అంతరాలను దాటుకుని, తమలో దాగున్న అనంత శక్తిని యావత్ ప్రపంచానికి చాటాలన్న సమున్నత లక్ష్యంతో రూపుదిద్దుకున్న కార్యక్రమం. అసమానతల్ని అధిగమించి ఇంటా బయటా, సమాజ ప్రగతికి సంబంధించిన ప్రతి మలుపులోనూ తనదైన ముద్రవేసిన మహిళా మణులెందరినో మనసారా స్మరించుకునే ఘట్టం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ, పురుష సమానత్వాన్ని కాంక్షిస్తూ, సిసలైన మహిళాభ్యున్నతి భావనను ‘సాక్షి’ సొంతం చేసుకున్న అపురూప సందర్భం. స్త్రీలు ఆజన్మాంతం ఎదుర్కొంటున్న సవాళ్ళను సవివరంగా చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించి, మహిళా సాధికారతను మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ సాగింది ‘సాక్షి’. ఈ క్రతువులో నెల రోజుల పాటు అందించిన, అందిస్తున్న కథనాలు, కథలు, వాస్తవికతలను పాఠకలోకం ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. నిండు మనసుతో సొంతం చేసుకుంది.
సమానత్వ సాధనకు ‘సాక్షి’ చేపట్టిన లింగ వివక్ష వ్యతిరేకోద్యమంలో అశేష పాఠకులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను నిలదీస్తూ, వారి మధ్య సమానత్వ సాధన దిశగా ‘సాక్షి’ వేసిన ఈ ముందడుగును మేధావులు, కవులు, రచయిత్రులు, ప్రజాస్వామికవాదులెందరో హృదయపూర్వకంగా అభినందించారు.
‘నేను శక్తి’ ప్రచారోద్యమంలో మొదట లింగ వివక్ష, గృహ హింస, లైంగిక వేధింపులు, సాధికారత... ఈ నాలుగు అంశాలపై ‘సాక్షి’ విçస్తృతంగా చర్చించింది. తమ అమ్మాయిలను వివక్షను ఎదిరించి నిలిచే ధీరవనితలుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను ‘సూపర్ పేరెంట్స్’గా సత్కరించుకునేందుకు, సంబంధిత కథనాలతో కూడిన 10 నిమిషాల నిడివి గల ‘షార్ట్ ఫిల్మ్’లను ఆహ్వానించింది. ఇందుకు పాఠక లోకం నుంచి విశేష స్పందన లభించింది.
అందిన ఎంట్రీల్లోంచి అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘నేను శక్తి’ ముగింపు వేడుకల్లో సముచితంగా సత్కరించాలని భావిస్తున్నాం. ఈ నెల 7న హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు జరిగే ‘నేను శక్తి’ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మీ అందరికీ ఇదే సాదర ఆహ్వానం. వేడుకల్లో పాల్గొనేందుకు 95055 55020కు ఫోన్ చేసి పేరు నమోదు చేయించుకోగలరు.
Comments
Please login to add a commentAdd a comment