తనను పెళ్లి చేసుకుంటాననుకోలేదు: హీరో
తాజా ఐఫా అవార్డుల ఉత్సవంలో షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. గ్రీన్‌కార్పెట్‌పై నడుస్తూ ఫొటోలకు ఫోజిలివ్వడమే కాదు.. ఈ జోడీ షో అంతటా సందడి చేసింది. ఇక 'ఉడ్తా పంజాబ్' సినిమాకుగాను ఉత్తమ నటుడు పురస్కారాన్ని సొంతం చేసుకున్న షాహిద్.. ఆ క్రెడిట్ అంత తన భార్యదేనంటూ కొనియాడాడు. 'నా బలం, నా అదృష్టం తనే' అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు.
ఐఫా అవార్డుల వేడుక ప్రారంభమై 18 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా 'బెస్ట్ యాక్టర్' అవార్డును అందుకున్న షాహిద్‌ను వ్యాఖ్యాతలు కొంచెం నాటీ క్వషన్స్ అడిగారు. 18 ఏళ్ల వయస్సులో మీరేం చేశారంటూ ప్రశ్నించగా.. 'నాకు 18 ఏళ్ల వయస్సు అప్పుడు నిజంగా అనుకోలేదు. అప్పటికీ ఐదేళ్ల వయస్సున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని.. నిజంగా ఇది నేను చేసిన నాటీ పని అయి ఉంటుంది' అని షాహిద్ చెప్పుకొచ్చాడు. షాహిద్-మీరా దంపతుల మధ్య వయసురీత్యా 13ఏళ్ల వ్యత్యాసం ఉన్న సంగతి తెలిసిందే. ఐఫా పురస్కారం అందుకున్న షాహిద్ భార్యతో కలిసి షోలో ఫుల్ హల్‌చల్ చేయడమే కాదు.. మీడియాతోనూ సరదాగా ముచ్చటించాడు.