అమ్మకాలపైనే ఆశలు! | New alcohol policy Alcohol sales on hopes | Sakshi
Sakshi News home page

అమ్మకాలపైనే ఆశలు!

Published Wed, Aug 26 2015 3:30 AM | Last Updated on Fri, Aug 17 2018 7:44 PM

అమ్మకాలపైనే ఆశలు! - Sakshi

అమ్మకాలపైనే ఆశలు!

సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానంతో ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గిపోతుందా, పెరుగుతుందా..? అన్నదానిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. కొత్త విధానం ప్రకారం చీపెస్ట్ లిక్కర్‌ను రూ.15కు 90 ఎంఎల్ సీసా చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరలో అమ్మాలంటే మద్యంపై ఇప్పుడున్న వ్యాట్‌ను 49 శాతానికి తగ్గించాలని భావిస్తున్నారు. దీనివల్ల సర్కారుకు వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోతుంది. కానీ అతి తక్కువ ధరకు మద్యం వస్తుందనే ఉద్దేశంతో వినియోగం భారీగా పెరుగుతుందని..

తద్వారా మొత్తంగా వచ్చే ఆదాయం దాదాపు ప్రస్తుత స్థాయిలోనే ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చీపెస్ట్ లిక్కర్ అందుబాటులోకి వస్తే ఎక్కువ ధర ఉన్న మద్యం విక్రయాలు పడిపోతాయని, దానివల్ల ఎక్సైజ్‌పై వచ్చే వ్యాట్ ఆదాయం తగ్గుతుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. మొత్తంగా కొత్త మద్యం విధానమంతా ‘అమ్మకాల’ చుట్టే తిరుగుతోంది.
 ప్రస్తుతం 90 ఎంఎల్ చీప్ లిక్కర్ రూ.30 ధరకు విక్రయిస్తున్నారు.

వివిధ రకాల మద్యంపై కనిష్టంగా 70 శాతం నుంచి గరిష్టంగా 190 శాతం వరకు వ్యాట్ ఉంది. దీన్ని తగ్గించటంతో వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుందని ఆర్థిక శాఖ లెక్కలేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌పై వ్యాట్ ద్వారా రూ.8,291 కోట్లు రాబట్టాలని ప్రభుత్వం అంచనాలు వేసుకుంది. కానీ కొత్తగా వచ్చే చీపెస్ట్ లిక్కర్ కారణంగా వ్యాట్ ఆదాయం తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం రూ.60 చెల్లించి మద్యం కొనుగోలు చేస్తున్నవారు తక్కువ ధరకు వస్తుందని రెండు చీపెస్ట్ బాటిళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుం దని... వినియోగం పెరిగితే వ్యాట్ శాతం తగ్గినా ప్రమాదమేమీ లేదనే వాదన ఉంది.
 
నష్టమని చెబుతున్న ఎక్సైజ్ శాఖ..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న చీప్‌లిక్కర్ 48 బాటిళ్లు (180 ఎంఎల్) ఉన్న పెట్టెపై రూ.1,885 పన్ను రూపంలో రాష్ట్ర ఖజానాలో జమవుతుంది. వ్యాట్ తగ్గింపు కారణంగా ఇది రూ.734కు తగ్గిపోతుంది. అంటే ఒక్కో పెట్టెపై రూ.1,151 ఆదాయం తగ్గిపోతుందని ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కానీ వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం అమ్మకాలతో ముడిపడి ఉన్నందున దీని ప్రభావం రూ.200 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్యలో ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే వ్యాట్, అమ్మకపు పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంచనా వేసిన స్థాయిలో ఉండడం లేదు. ప్రతి నెలా రూ.3,000 కోట్లు రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ గత నాలుగు నెలల ఆదాయ గణాంకాలను చూస్తే ఒక్క జూలైలో గరిష్టంగా రూ.2,500 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త విధానంతో వచ్చే లాభనష్టాలను ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదించనుంది.
 
లెసైన్సు ఫీజుతో లోటు భర్తీ..
వ్యాట్ ద్వారా తగ్గే ఆదాయాన్ని లెసైన్స్ ఫీజు, స్టేట్ ఎక్సైజ్ ద్వారా రాబట్టుకునే ప్రత్యామ్నాయాలను సైతం ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించింది. దీనికి అనుగుణంగా కొత్త విధానానికి రూపకల్పన చేసింది. ప్రస్తుతమున్న మద్యం దుకాణాల లెసైన్సుల ద్వారా ప్రభుత్వానికి రూ.900 కోట్ల ఆదాయం వచ్చింది. నిర్దేశించిన కోటాకు మించి మద్యం అమ్మకాలు చేసినందుకు దుకాణాదారులు చెల్లించిన ఫీజు మరో రూ.420 కోట్లు ఖజానాలో జమ అయింది. మొత్తంగా ఆదాయం రూ.1,320 కోట్లకు మించింది.

దీంతో ఈసారి లెసైన్సులకు నిర్దేశించే రుసుము అంతకంటే ఎక్కువగా ఉండాలని ప్రభుత్వం లెక్కలేసుకుంది. దీనిద్వారానే దాదాపు రూ.2,000 కోట్లు సంపాదించాలని భావిస్తోంది. వ్యాట్‌కు గండి పడినా... ఇలా ఆదాయం రాబట్టుకోవాలనేది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా రూ.3,916 కోట్ల రాబడిని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందులో తొలి నాలుగు నెలల్లో రూ.1,150 కోట్లు ఆదాయం వచ్చింది. దీంతో కొత్త మద్యం విధానం లాభసాటిగా ఉంటుందా, నష్టం వస్తుందా.. అని తేల్చలేకపోతోంది. అమ్మకాలతో ముడిపడి ఉన్నందున విక్రయాలు పెరిగితే, వ్యాట్ తగ్గించినా ఇబ్బందేమీ లేదని.. విక్రయాలు ఇప్పుడున్న స్థాయిలో ఉంటే ఆదాయం తగ్గిపోతుందని భావిస్తోంది.
 
ఈ ఏడాది మద్యం విక్రయాల ఆదాయం..
ఏప్రిల్  ⇒ రూ.185 కోట్లు
మే  ⇒ రూ.190 కోట్లు
జూన్ ⇒ రూ.525 కోట్లు
జూలై  ⇒  రూ.250 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement