ఆ సినిమా బాక్సాఫీస్‌కు బాంబు పెట్టింది!
ట్రాన్స్‌ఫార్మర్స్, ఇండియానా జోన్స్ వంటి ప్రతిష్టాత్మక హాలీవుడ్ సినిమాలు తీసిన అగ్రహీరో షాయా లాబౌఫ్ తాజా సినిమా 'మ్యాన్ డౌన్' బ్రిటన్ బాక్సాఫీస్‌కు ఒకరకంగా బాంబు పెట్టింది. డైరెక్టర్ డిటో మాంటియల్ రూపొందించిన ఈ వార్ డ్రామా బ్రిటన్‌లో కేవలం ఏడుపౌండ్లు (రూ. 567) మాత్రమే వసూలు చేసింది. ఈ కలెక్షన్ కూడా ఒక్క టికెట్‌దే కావడం గమనార్హం.
ఈ సినిమా కేవలం ఒక్క థియేటర్‌లోనే విడుదలైంది. ఆ థియేటర్‌లోనూ కేవలం ఒక్క టికెట్ మాత్రమే అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. గతంలో పలు సూపర్‌హిట్ సినిమాలు తీసిన లాబౌఫ్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొని అరెస్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అతను సినిమాలపై దృష్టి పెట్టాడు. పెద్దగా కలెక్షన్ ఏమీ లేకపోవడంతో ఈ సినిమాను వెంటనే వీడియో ఆన్ డిమాండ్ పేరిట ఆన్‌లైన్‌లో పెట్టేశారు.
లాబౌఫ్ సినిమానే కాదు గతంలో పలు హాలీవుడ్ సినిమాలు కూడా ఇలాగే బాక్సాఫీస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. అమెరికాలో రెండువేలకుపైగా థియేటర్లలో విడుదలైన పిల్లల సినిమా ద వూజీలవ్స్ ఇన్ ద బిగ్ బెలూన్ అడ్వంచర్ (2012)..కేవలం 206 డాలర్లు మాత్రమే వసూలు చేసింది. అమెరికాలో ఒక్క టికెట్ ధర 10 డాలర్లు. ఇక హ్యాలీ బెర్రీ నటించిన డార్క్ టైడ్ (2012) సినిమా బ్రిటన్‌లో కేవలం 90 పౌండ్లు వసూలు చేసింది. ప్రస్తుతం డిస్నీ నిర్మించిన 'బ్యూటీ అండ్ బీస్ట్' సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఎమ్మా వాట్సన్‌కు 2015లో ఇదేరకమైన అనుభవం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వసూళ్లు సొంతం చేసుకున్న హ్యారీపొటర్ సినిమాలతో తళుక్కుమన్న ఈ అమ్మడు నటించిన 'కలోనియా' చిత్రం బ్రిటన్‌లో కేవలం 47పౌండ్లు వసూలు చేసింది.