
న్యూ రీ-డిజైన్డ్ ఐఫోన్ ఎప్పుడొస్తుందో తెలుసా?
లాస్ ఏంజెల్స్ : యాపిల్ నుంచి సెప్టెంబర్లో రాబోతున్న రీడిజైన్ కొత్త ఐఫోన్ కోసం వేచిచూస్తున్నారా..? అయితే మీరు మరికొంత కాలం పాటు వేచిచూడాల్సిందే. ఐఫోన్ 10వ వార్షికోత్సవాన్ని యాపిల్ 2017లో జరుపుకోబోతుందంట. ఆ సెలబ్రేషన్స్ లోనే కొత్తగా రీడిజైన్ చేసిన ఫోన్ను ప్రవేశపెడతారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సెప్టెంబర్లో తీసుకొచ్చే ఫోన్, ఐఫోన్7 కాదంట. చిన్న చిన్న మార్పులతోనే ఐఫోన్ 6ఎస్ఈని మార్కెట్లోకి తీసుకొస్తారని ఓ జర్మన్ వెబ్సైట్ పేర్కొంటోంది. అయితే కంప్లీట్ రీడిజైన్ ప్రొడక్ట్ను యాపిల్ తన 10వ వార్షికోత్సవంలోనే ఆవిష్కరిస్తుందని యాపిల్ అనలిస్టు క్రియేటివ్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ టిమ్ బజరిన్ తెలిపారు. అయితే దాన్ని పేరు కూడా ఐఫోన్8గా ఉంటుందని పేర్కొంటున్నారు.
ఈ బిగ్ రీడిజైన్ ఫోన్లో చాలా కొత్త ఫీచర్లుంటాయని, వైర్లెస్ చార్జింగ్, గ్లాస్ బాడీ అరౌండ్ మెటల్ ఫ్రేమ్, కెమెరా ఇంఫ్రూవ్మెంట్, ఎక్కువ మెమరీ, అమోలెడ్ 4కే స్క్రీన్లు ఈ బిగ్ రీ-డిజైన్ ప్రొడక్ట్లో ఉండబోతున్నాయని చెబుతున్నారు. 2017 రిలీజ్ ఐఫోన్, రెండేళ్ల మేజర్ డిజైన్ అప్ గ్రేడ్స్ కు అంతరాయం కల్గిస్తుందని పేర్కొంటున్నారు. 2014లో ఐఫోన్6తో యాపిల్ లాస్ట్ అప్ గ్రేడ్ చేపట్టింది. ఐఫోన్లలో ఇదే బెస్ట్ సెల్లింగ్ ఐఫోన్ గా నిలిచింది. తర్వాత ఏడాదిన్నరకి అదేమాదిరి డిజైన్తో మరో ఐఫోన్ 6ఎస్ను లాంచ్ చేసింది. డిజైన్లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, కొన్ని కొత్త ఫీచర్లను ఈ ఫోన్కు యాపిల్ జోడించింది.
మరోవైపు యాపిల్ బిగ్ రీ-డిజైన్ 2017కు పోస్ట్ పోన్ అయిందని చైనీస్ తయారీదారులు సూచిస్తున్నట్టు జర్మన్ యాపిల్ న్యూస్ సైట్ పేర్కొంది. అదేవిధంగా ప్రొడక్ట్ అప్ గ్రేడ్ కాలం కూడా ఇక మూడేళ్లు కాబోతుందని నిక్కీ ఆసియన్ రివ్యూ రిపోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 16న ఐఫోన్ 6ఎస్ఈ ప్రవేశపెడతారని, దాంతో పాటు కొత్త ఐప్యాడ్, యాపిల్ వాచ్, ఐఓఎస్10ను ఆవిష్కరిస్తుందని తెలుస్తోంది. తర్వాత రాబోతున్న ఐఫోన్లన్నీ యాపిల్ ఏ10 ప్రాసెసర్, 2/4జీ ర్యామ్ వేరియంట్లు, బిగ్గర్ బ్యాటరీస్లతో ఉంటాయట. అలాగే సెప్టెంబర్లో వచ్చే ఫోన్ రెండు వేరియంట్లలో కాదంట. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ వస్తుందట.