![వెయిట్రెస్ జుట్టు లాగిన ప్రధాని.. క్షమాపణ! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51429692927_625x300.jpg.webp?itok=BjjN5GAa)
వెయిట్రెస్ జుట్టు లాగిన ప్రధాని.. క్షమాపణ!
ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా.. చిన్న చిన్న తప్పులు చేసి పప్పులో కాలేస్తారు కొందరు నేతలు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఓ వెయిట్రెస్ జుట్టు పట్టుకుని పదే పదే లాగిన ఆయన.. చివరకు ఆమెకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆక్లండ్లో ఓ వెయిట్రెస్ వేసుకున్న పోనీ టెయిల్ పట్టుకుని లాగడంతో.. ఆమె దాన్ని వేధింపులుగా భావించింది. దీంతో ప్రధాని జాన్ కీ క్షమాపణ చెప్పారు. ఆమెను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని, అయినా.. ఆమె ఇబ్బంది పడి ఉంటే క్షమాపణ చెబుతున్నానని తన ప్రతినిధి ద్వారా ఆయన తెలిపారు. దాంతో పాటు ఆయన జాతి మొత్తానికి బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.
టర్కీ వెళ్తున్న ఆయన.. లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. సాధారణంగా ప్రాక్టికల్స్ జోకులు వేయడం తనకు ఇష్టమని, అందుకు ఆమె బాధపడినట్లు తెలియగానే క్షమాపణ చెప్పానని అన్నారు. ఆమెకు వైన్ ఇచ్చి క్షమాపణ చెప్పగానే.. ఆమె దానికి సరేనని చెప్పిందన్నారు. స్కూల్లో పిల్లలు తోటి పిల్లల జడ పట్టుకుని లాగినట్లుగా.. ఆయన కూడా తన జుట్టుతో ఆడుకున్నారని బాధితురాలైన వెయిట్రెస్ తెలిపింది.