భార్య చెప్పిందనే ప్రధాని పదవికి గుడ్‌బై!
వెల్లింగ్టన్: దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రధాని పదవిలో కొనసాగుతున్న న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ అనూహ్యంగా రాజీనామా చేయడానికి ఆయన భార్యనే కారణం అని తెలిసింది. తన భార్య విజ్ఞప్తి మేరకే ఆయన తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారట. రాజీనామా సందర్భంలో కూడా ఇక తాను కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటున్నానని ఆయన ప్రకటించడం కూడా ఇదే అంశానికి బలాన్ని చేకూరుస్తుంది. జాతీయ పార్టీ నేతగా కూడా ఆయన రాజీనామా చేశారు.
‘నేను తీసుకుంటున్న ఈ నిర్ణయం ఇప్పటి వరకు తీసుకున్నవాటిల్లోనే కఠినమైనది. తర్వాత నేను ఏం చేస్తానో నాకు తెలియదు. కానీ కుటుంబంతో మాత్రం గడుపుతాను’ అని రాజీనామా సందర్భంగా జాన్ కీ చెప్పారు. అయితే, ఓ మీడియా కథనం ప్రకారం ప్రధాని పదవి బాధ్యతలు ఇక చాలించాలని ఆయన భార్య బ్రోనాగ్ కోరింది. అది కూడా ఇప్పటి వరకు కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్నాడని, ఇకనైన తమ కూతురు స్టెఫీ, కుమారుడు మ్యాక్స్ జీవితాలకోసమైనా ఆ బాధ్యతలు చాలించి కుటుంబంతో గడపాలని కాస్తంత ఘాటుగా చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.
కనీసం ముందస్తు సూచనలు కూడా ఇవ్వకుండానే పార్టీ ఎంపీలకు, జాతీయ కార్యవర్గానికి జాన్ కీ షాకిచ్చారని అంటున్నారు. కాగా, మంచి అయినా చెడు అయినా, దేశానికి మంచి విశ్వాసాన్ని జాన్ కీ అందించాడనడంలో ఎలాంటి సందేహం లేదని, ఆయన అందించిన సేవలు భిన్నంగా దేశాన్ని ముందుకు నడిపించాయని, ఆయన గొప్ప నేత అని డిప్యూటీ ప్రధాని బిల్ ఇంగ్లిష్ చెప్పారు. న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ 8 ఏళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు.
ప్రజాదరణ గల నాయకుడిగా గుర్తింపు పొందారు. వచ్చే ఏడాది ఆ దేశంలో జరిగే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని భావించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. ఇతర ప్రపంచ నాయకులు చేసిన తప్పును తాను చేయబోనని జాన్ కీ పేర్కొన్నారు. ప్రజాదరణ నేతగా ఉన్నప్పుడే తప్పుకోవాలని భావించినట్టు తెలిపారు. ప్రధాని పదవి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశానని, ఇక కుటుంబంతో గడుపుతానని చెప్పారు. ఈ నెల 12న పార్టీ సమావేశమై కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని జాన్ కీ వెల్లడించారు. ఆయన అదే రోజు అధికారికంగా పదవి నుంచి వైదొలుగుతారు. 2002లో చట్టసభకు ఎన్నికైన జాన్ కీ 2008లో ప్రధాని అయ్యారు.