24 గంటలు గడిస్తే తప్ప..!
- 24 గంటల్లో జయలలితకు చికిత్స స్పందించే అవకాశం: వైద్యులు
చెన్నై: ఆరోగ్యం తీవ్రంగా విషమించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ కోలుకోవడంపై 24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని చెన్నైలోని అపోలో వైద్య వర్గాలు చెప్తున్నాయి. రానున్న 24 గంటలు జయలలితకు అత్యంత కీలకమని, ఆమె చికిత్సకు స్పందించడానికి 24 గంటల సమయం పట్టవచ్చునని వైద్యులు తెలిపారు. అదేసమయంలో జయలలిత రక్తపోటు, హృదయ స్పందన (హార్ట్‌రేట్), శ్వాస, బాడీ టెంపరేచర్ వంటివి వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
జయలలితకు ఆదివారం సాయంత్రం తీవ్రస్థాయిలో గుండెపోటు రావడంతో ఆమెకు ‘ఈసీఎంవో’ ఏర్పాటు చేశామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈసీఎంవో అంటే ‘ఎక్‌స్ట్రాకార్పోరియల్ మెబ్రేన్ ఆక్సిజెనేషన్’.. శారీరక ధర్మాలను గుండె, ఊపిరితిత్తులు నిర్వహించలేకపోయినప్పుడు ఈ యాంత్రిక వ్యవస్థ ద్వారా వాటి విధులను నిర్వహింపజేస్తారు. రోగికి అత్యంత ప్రాణాపాయం ఉన్నప్పుడు మాత్రమే ఈ యాంత్రిక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇందులో రోగి బతికే అవకాశాలు ఫిఫ్టీ, ఫిఫ్టీ మాత్రమే ఉంటాయని హృద్రోగ నిపుణులు చెప్తున్నారు.
జయలలిత ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని అపోలో ఆస్పత్రి విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించడంతో తమిళనాడు అంతటా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్షణక్షణం అమ్మ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతుండటంతో ఒక్క చెన్నై నగరంలోనే 15వేలమంది బలగాలను మోహరించారు. అపోలో ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న షాపులన్నింటినీ ఖాళీ చేయించి.. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.