విజయవాడలో ఎన్‌ఐడీ | NID in vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో ఎన్‌ఐడీ

Published Sat, Mar 1 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

విజయవాడలో ఎన్‌ఐడీ

విజయవాడలో ఎన్‌ఐడీ

కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం
 రూ. 108 కోట్లతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ ఏర్పాటు
 సీమాంధ్రకు మేలు చేయాలన్న లక్ష్యంలో ఇదొకటి: జైరాం రమేష్
 తెలంగాణలో 7, సీమాంధ్రలో 3 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు
 హెచ్‌ఎంటీ బలోపేతానికి రూ. 134 కోట్లు ప్రణాళికేతర రుణం
 టీ-బిల్లు చట్టరూపం దాల్చకముందే ‘పోలవరం’పై ఆర్డినెన్స్ తేలేం
 సీమాంధ్ర ‘ప్రత్యేక హోదా’కు కేబినెట్, ఎన్‌డీసీ ఆమోదం అక్కర్లేదు
 ప్రణాళికా సంఘం చైర్మన్ హోదాలో ప్రధానే స్వయంగా ప్రకటించారు
 ‘ప్రత్యేక హోదా’ బీజేపీ కోరలేదు.. కాంగ్రెస్సే చర్చించి నిర్ణయించింది
 రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఒక రోజు ఉండొచ్చు.. వారం ఉండొచ్చు..
 24 వారాలు మించకుండా ఎన్ని రోజులైనా ఉండొచ్చు
 కేబినెట్ భేటీ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన కేంద్రమంత్రి జైరాం
 
 సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ (ఎన్‌ఐడీ) సంస్థను విజయవాడలో ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అస్సాంలోని జోరాట్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, హర్యానాలోని కురుక్షేత్రలతో పాటు.. సీమాంధ్రలోని విజయవాడలో ఎన్‌ఐడీ సంస్థలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం మొత్తం రూ. 434 కోట్లు మంజూరు చేసింది. అంటే.. విజయవాడలో దాదాపు రూ. 108 కోట్ల వ్యయంతో ఎన్‌ఐడీని ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర పరిశ్రమల శాఖ ఈ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ.. కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చ అనంతరం దీన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా అందుబాటులోకి వస్తాయి.
 
 ‘‘ఇది జాతీయ స్థాయి విద్యాసంస్థ. సీమాంధ్రకు మేలు చేయాలన్న కేంద్ర లక్ష్యంలో ఇదొకటి’’ అని కేంద్రమంత్రి జైరాంరమేష్ కేబినెట్ భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. అలాగే.. దేశవ్యాప్తంగా మొత్తం 54 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా.. అందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో 10 విద్యాలయాలు ఏర్పాటుకాబోతున్నాయని ఆయన చెప్పారు. ఇందులో తెలంగాణకు 7, సీమాంధ్రలో 3 ఏర్పాటవుతాయని.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని ప్రారంభించాలని నిర్ణయించటం జరిగిందని వెల్లడించారు. ఒక్కో కేంద్రీయ విద్యాలయానికి రూ. 15 కోట్లు మంజూరు చేస్తారని.. వీటిని కేంద్రమే నిర్వహిస్తుందని తెలిపారు. ఇక హెచ్‌ఎంటీ (హిందుస్థాన్ మిషన్ టూల్స్) లిమిటెడ్ అభివృద్ధి పథంలో సాగేందుకు గాను దాదాపు రూ. 134 కోట్లను ప్రణాళికేతర రుణ రూపంలో ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఈ సంస్థకు హైదరాబాద్‌లో కూడా ఒక ఉత్పత్తి కేంద్రం ఉంది. శుక్రవారం నాటి కేబినెట్ భేటీకి.. రాష్ట్రానికి చెందిన ముగ్గురు కేబినెట్ మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ హాజరయ్యారు. మరో కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి హాజరుకాలేదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్రమంత్రి చిరంజీవి సైతం పర్యాటక శాఖకు చెందిన అంశాల కోసం ఈ భేటీకి హాజరయ్యారు.
 
 టీ-బిల్లు చట్టమయ్యాకే ‘పోలవరం’పై ఆర్డినెన్స్...
 
 ‘‘పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు ఆర్డినెన్స్ తేవాలంటే ముందుగా పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014 రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టరూపం దాల్చాలి. చట్టరూపం దాల్చితేనే దానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తేవొచ్చు’’ అని జైరాం తెలిపారు. ఇక సీమాంధ్రకు ప్రత్యేక హోదా గురించి చెప్తూ ‘‘దానికి ప్రత్యేకంగా కేబినెట్ ఆమోదం అవసరం లేదు. ప్రణాళిక సంఘం చైర్మన్ హోదాలో ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్ ప్రకటించారు. అది అమలై తీరుతుంది. జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) ఆమోదం కూడా అవసరం లేదు. 2002లో ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఎన్‌డీసీ ఆమోదం ఏమీ తీసుకోలేదు. అప్పుడు కేబినెట్ ఆమోదించింది. ఇప్పుడు మాత్రం నేరుగా ప్రణాళిక సంఘం చైర్మన్ హోదాలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ప్రకటన చేశారు.. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడం వల్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా, పదేళ్ల పాటు ఆర్థిక రాయితీలు, పన్ను మినహాయింపులు కొనసాగుతాయి..’’ అని పేర్కొన్నారు.
 
 రాష్ట్రపతి పాలన రోజు కావచ్చు..వారం కావచ్చు...
 
 ‘‘రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్రం సిఫారసు చేసింది. అలాగే అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచాలని కూడా సిఫారసు చేసింది. అసెంబ్లీ గడువు జూన్ 2 వరకు ఉంటుంది.. అంటే రాష్ట్రపతి పాలన ఒక రోజు ఉండొచ్చు.. ఒక వారం ఉండొచ్చు.. లేదా 24 వారాలకు మించకుండా ఎప్పటివరకైనా ఉండొచ్చు...’’ అని జైరాం వివరించారు. ‘‘అసలు బీజేపీ ‘ప్రత్యేక హోదా’ అడగనేలేదు. కానీ వారే అడిగినట్టు చెప్పుకొంటున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యాక తగిన అధ్యయనం చేసి తీసుకున్న నిర్ణయమిది’’ అని పేర్కొన్నారు. ‘‘సీమాంధ్ర రాజధాని విషయమై.. నోటిఫికేషన్ రోజున నిపుణుల కమిటీ ఏర్పాటవుతుంది. రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశంపై ఆరు నెలల్లోగా నివేదిక ఇస్తుంది. కర్నూలు, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు కావాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే ఈ కమిటీ అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తుంది..’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement