భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Published Mon, Dec 26 2016 9:51 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
గత ఏడు సెషన్లోని పతనానికి బ్రేక్ పడి వారాంతంలో కోలుకున్న స్టాక్మార్కెట్లు, మళ్లీ భారీ నష్టాల బాట పట్టాయి. ఈక్విటీ బెంచ్ మార్కు సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కిందకి దిగజారింది. నిఫ్టీ తన కీలకమార్కు 7950నుంచి పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 237.70 పాయింట్ల నష్టంలో 25,803 వద్ద, నిఫ్టీ 76.05 పాయింట్ల నష్టంలో 7,909 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్స్, సిప్లా, ఎస్బీఐ, టాటా మోటార్స్ల్లో నెలకొన్న నష్టాలతో సెన్సెక్స్ నష్టాల్లో కొనసాగుతోందని విశ్లేషకులు చెప్పారు. నిఫ్టీ సైతం రియాల్టీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్సూమర్ డ్యూరెబుల్స్లో ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
అటు డాలర్తో రూపాయి మారకం విలువ ఫ్లాట్గా 67.82 వద్ద ప్రారంభమైంది. ఆయిల్ ధరలపై మార్కెట్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయని తెలిసింది. లిబియా ఉత్పత్తిని పెంచాలన్న నేపథ్యంలో ఒపెక్ అవుట్పుట్లో కోతకు ఎలా ప్లాన్ చేయబోతుందోనని మార్కెట్లు దృష్టిసారించినట్టు విశ్లేషకులు చెప్పారు. 10 నెలల కనిష్టానికి వచ్చిన బంగారం ధరలపై కొనుగోలుదారులు లబ్ది పొందాలని కొనుగోళ్లు చేపట్టడంతో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 37 రూపాయల లాభంతో 27,005 వద్ద కొనసాగుతోంది.
Advertisement