
6,000 దిగువన నిఫ్టీ
వినియోగ ద్రవ్యోల్బణం పెరగడంతో రిజర్వుబ్యాంక్ మళ్లీ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయాలు, అమెరికా కేంద్ర బ్యాంక్ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణను వచ్చేనెలలోనే ప్రారంభించవచ్చన్న భయాలతో దేశీయ స్టాక్ సూచీలు వరుసగా ఏడోరోజు క్షీణించాయి.
వినియోగ ద్రవ్యోల్బణం పెరగడంతో రిజర్వుబ్యాంక్ మళ్లీ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయాలు, అమెరికా కేంద్ర బ్యాంక్ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణను వచ్చేనెలలోనే ప్రారంభించవచ్చన్న భయాలతో దేశీయ స్టాక్ సూచీలు వరుసగా ఏడోరోజు క్షీణించాయి. బుధవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 88 పాయింట్ల తగ్గుదలతో 20,194 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఐదువారాల తర్వాత తొలిసారిగా 6,000 పాయింట్ల దిగువన 5,989 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 28 పాయింట్లు నష్టపోయింది. ఈ రెండు సూచీలు అక్టోబర్ 8 తర్వాత ఇంత కనిష్టస్థాయిలో ముగియడం ఇదే ప్రధమం. ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ షేర్లు క్షీణించగా, మెటల్, ఆటో షేర్లలో కొనుగోళ్లు జరిగాయి.
ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లలో షార్ట్ బిల్డప్...
ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ కదలికల్లో కీలకపాత్ర వహించే ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), ఐటీసీ, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కౌంటర్లలో తాజాగా షార్ట్ బిల్డప్ జరిగింది. ఈ నాలుగు షేర్లకు నిఫ్టీలో 30 శాతంపైగా వెయిటేజి వుంది. ఆర్‌ఐఎల్ ఫ్యూచర్ కాంట్రాక్టులో 2.67 లక్షల షేర్లు (2.5 శాతం) యాడ్‌కావడంతో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.09 కోట్ల షేర్లకు చేరింది. ఆర్‌ఐఎల్ ఫ్యూచర్‌లో ఓఐ కోటి షేర్లను దాటడం అరుదు. ఐటీసీ ఫ్యూచర్లో 2.89 లక్షల షేర్లు (1.3 శాతం), ఎల్ అండ్ టీ ఫ్యూచర్లో 2.43 లక్షల షేర్లు (3 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫ్యూచర్లో 14.64 లక్షల షేర్ల (14.5 శాతం) చొప్పున యాడ్ అయ్యాయి.
పైగా ఈ నాలుగు షేర్ల ఫ్యూచర్ ప్రీమియం స్పాట్ ధరతో పోలిస్తే క్రితం రోజుకంటే తగ్గింది. ఇలా ప్రీమియం తగ్గుతూ ఓఐ యాడ్‌కావడం ఆయా కాంట్రాక్టులో షార్టింగ్‌ను సూచిస్తుంది. అయితే మరోవైపు ప్రధాన సూచీ నిఫ్టీ ఫ్యూచర్లో మాత్రం లాంగ్ ఆన్‌వైండింగ్ జరిగింది. ఈ కాంట్రాక్టు నుంచి 6.30 లక్షల షేర్లు (3.22 శాతం) కట్‌కావడంతో ఓఐ 1.89 కోట్ల షేర్లకు పడిపోయింది. మరోవైపు స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 53 పాయింట్ల నుంచి 44 పాయింట్లకు పడిపోయింది. సమీప భవిష్యత్తులో ఇతర రంగాల షేర్ల సహకారంతో నిఫ్టీ పెరిగినా, ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు మార్కెట్‌ను ఒత్తిడికి గురిచేస్తాయని ఈ డెరివేటివ్ యాక్టివిటీ సూచిస్తున్నది.
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో నేడు ట్రేడింగ్
మొహర్రం సెలవు శుక్రవారానికి మార్పు
మొహర్రం సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు శుక్రవారం(15న) సెలవు ప్రకటించారు. అయితే తొలుత గురువారం(14న) మొహర్రం సెలవును ప్రకటించిన విషయం విదితమే. ఈ మార్పును బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్) తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. వెరసి 14న ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్ యథావిధిగా జరగనుంది.