
నిలోఫర్‌లో విభజన చిచ్చు
హైదరాబాద్, న్యూస్‌లైన్: నిలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రిలో విభజన చిచ్చు రేగింది. ఉద్యోగులు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ప్రాంతాలవారీగా చీలిపోయారు. 20 ఏళ్లుగా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సివిల్ సర్జన్(ఆర్‌ఎంవో-1) డాక్టర్ ఉషారాణిని తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ వైద్యాధికారులు సోమవారం నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యంను ఘెరావ్ చేశారు. సూపరింటెండెంట్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి ఆందోళనకు దిగారు. అవినీతికి పాల్పడుతున్న ఉషారాణిని తక్షణమే బదిలీ చేయించాలని, లేనిపక్షంలో సూపరింటెండెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లి పోవాలని సుబ్రహ్మణ్యంపై ఒత్తిడి తెచ్చారు. సూపరింటెండెంట్ మౌనం పాటించడంతో తెలంగాణ వైద్యాధికారులు ఆయనను చుట్టుముట్టి బలవంతంగా రాజీనామా చేయిం చేందుకు యత్నించారు.
అనంతరం ఆర్‌ఎంవో డాక్టర్ ఉషారాణిపై తెలంగాణ వైద్యాధికారులు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నువ్వు ఎక్కడ పుట్టావు.. ఇక్కడికెందుకు వచ్చావు... నీ వెనుక ఎవరున్నారంటూ నిలదీశారు. రాజీనామా చేస్తావా లేదా అంటూ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యంను కుర్చీలోంచి లేపేందుకు వైద్యులు ప్రయత్నించారు. సుబ్రహ్మణ్యం లేవకపోవడంతో ఆయన కుర్చీని పక్కను తోసేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. డీఎంఈ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో ఎంతోమంది అనుభవం కలిగిన వైద్యులు ఉన్నప్పటికీ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యంను నిలోఫర్ సూపరింటెండెంట్‌గా నియమించారని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు బొంగు రమేష్ ఆరోపించారు.
సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం ఆర్‌ఎంవో డాక్టర్ ఉషారాణిని అడిగి సలహాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. 20 ఏళ్ల నుంచి ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న ఉషారాణి టెండర్లు లేకుండా క్యాంటీన్‌ను తన అనుయాయులకు అప్పగించారని, క్యాంటీన్ నిర్వహణపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో తాను ఎలాంటి బెదిరింపులకూ భయపడనని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం అన్నారు. గిట్టని వారే అలజడులు సృష్టిస్తున్నారని, ఎవరో రాజీనామా చేయాలని కోరితే వెంటనే తెల్ల కాగితంపై సంతకం చేసే మనస్తత్వం తనది కాదని అన్నారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సివిల్ సర్జన్ (ఆర్‌ఎంవో-1) డాక్టర్ ఉషారాణి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యాధికారులు చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే అని కొట్టిపారేశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, రామ్‌సింగ్, శ్రీనివాస్, రమేష్, రవీందర్ గౌడ్, వినోద్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యంను ఘోరావ్ చేసిన వారిలో ఉన్నారు.