న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 2012 డిసెంబర్ 16 నాటి ‘నిర్భయ’ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో మరణశిక్ష పడిన నలుగురు దోషుల అప్పీళ్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. దోషులు తమ వాదనలను వారంలోగా లిఖితపూర్వకంగా సమర్పించాలని ధర్మాసనం సోమవారం ఆదేశించింది. దోషులు సదరు యువతిపై అమానుషంగా ప్రవర్తించారని, వారికి మరణశిక్ష సరైనదేనని ఢిల్లీ పోలీసుల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. అయితే దోషులకు జీవితఖైదు విధించే అవకాశాన్ని పరిశీలించవచ్చని ఈ విషయంలో కోర్టుకు సహాయకారి (అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్ అడ్వకేట్ రాజు రామచంద్రన్ సూచించారు.