తమిళనాడులో మరో ‘నిర్భయ’ | nirbhaya incident in tamil nadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో మరో ‘నిర్భయ’

Published Wed, Jun 7 2017 4:25 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

తమిళనాడులో మరో ‘నిర్భయ’ - Sakshi

తమిళనాడులో మరో ‘నిర్భయ’

♦  ప్రైవేట్‌ బస్సులో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
గంటకు పైగా బస్సు నడుపుతూ రాక్షసత్వం
ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్‌ అరెస్టు


సాక్షి ప్రతినిధి, చెన్నై:  దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ ‘నిర్భయ’ ఘటన తాజాగా తమిళనాడులో నూ పునరావృతమైంది. ముగ్గురు మృగాళ్లు చిన్నారి అనే కనికరం కూడా చూపకుండా నిర్దాక్షిణ్యంగా కాటువేశా రు. నడుస్తున్న బస్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సభ్యసమాజం తలదించుకునే ఈ దుర్మార్గం తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. సేలం నుంచి శివార్లలోని కరుప్పూరు ఇంజనీరింగ్‌ కళాశాలకు ప్రైవేట్‌ బస్సులు తిరుగుతుంటాయి.  కిచ్చిపాళయంకు చెందిన 15 ఏళ్ల బాలిక వలసయ్యూరులోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది.

 సోమవారం రాత్రి 8.30 గంటలకు తల్లిదండ్రులతో గొడవపెట్టుకుని ఇల్లు వదిలి వచ్చేసింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక సేలం పాత బస్టాండ్‌కు చేరకుంది. కరుప్పూరు వెళ్లే ప్రైవేట్‌ బస్సు కనిపించడంతో అందులో ఎక్కి టికెట్‌ తీసుకుంది. కరుప్పూరు ఇంజనీరింగ్‌ కాలేజీ సమీపంలో ప్రయాణికులంతా దిగిపోగా బాలిక మాత్రం ఒంటరిగా మిగిలింది. సేలం సన్యాసిగుండుకు చెందిన మణివణ్ణన్‌ (33) బస్సు నడుపుతుండగా, అతడితోపాటు అధికారిపట్టికి చెందిన మురుగన్‌ (35) రెండో డ్రైవర్‌గా ఉన్నాడు. వాళప్పాడి ముత్తంపట్టికి చెందిన పెరుమాళ్‌ (22) కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

బాలిక ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లు గమనించిన ఈ ముగ్గురు నెమ్మదిగా మాటకలిపి రాత్రి 10 గంటల సమయంలో కరుప్పూరులో దించకుండా నారాయణపాళయం వైపు బస్సును మళ్లించారు. దీంతో కంగారుపడిన బాలిక కేకలు వేయగా ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మురుగన్, పెరుమాళ్‌ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత మురుగన్‌ బస్సు నడుపుతుండగా మణివణ్ణన్‌ లైంగికదాడికి పాల్పడ్డాడు. బస్సును సుమారు గంటకు పైగా వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ బాలికపై ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ క్రమంలో బస్సు నుంచి పారిపోలేక, మృగాళ్ల బారి నుంచి తప్పించుకోలేక బాలిక బిగ్గరగా రోదించడంతో కొందరు స్థానికులు గమనించి అర్ధరాత్రి బస్సును అడ్డగించి నిలిపివేశారు. బస్సులోని ముగ్గురు దుర్మార్గులను పట్టుకుని దేహశుద్ధి చేసి బాలికతో పాటు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితురాలికి చికిత్స చేసి ఓమలూరు మహిళా పోలీస్‌స్టేషన్‌ రక్షణలో ఉంచారు. ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్ట్‌ చేశారు. నిర్భయ కేసు నిందితులకు ఉరిశిక్ష ఇంకా అమలు కాక ముందే తమిళనాడులో అదే తరహా దారుణం చోటుచేసుకోవడం శోచనీయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement