ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా హాజరయ్యారు. దేశ ఆర్థికాభివృద్దికి సంబంధించి 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్‌పై సమావేశంలో చర్చించారు. వచ్చే ఏడేళ్లలో అనుసరించాల్సిన వ్యూహం, మూడేళ్ల యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు.
బీజేపీయేతర ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ముకుల్ సంగ్మా వంటి వారు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. తమకు బదులుగా మంత్రులను ఈ సమావేశానికి పంపారు. ఈ రోజు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశ ప్రారంభానికి రాలేదు. కాగా బిహార్, తమిళనాడు ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, పళనిస్వామి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, వీరభద్ర సింగ్, మాణిక్ సర్కార్, పినరయి విజయన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.