నితీశ్ ఆహ్వానం.. బీజేపీలో చీలిక!
పట్నా: బిహార్ సీఎం నితీశ్‌కుమార్ తాజాగా ఇచ్చిన అధికారిక విందు.. బీజేపీలో పెద్ద చీలికనే తెచ్చింది. ఈ విందుకు కొందరు సీనియర్ నేతలు కొందరు హాజరుకాగా.. మరికొందరు డుమ్మా కొట్టారు. బీజేపీతో రెండు దశాబ్దాలకుపైగా ఉన్న అనుబంధాన్ని నితీశ్ తెగదెంపులు చేసుకున్న తర్వాత బీజేపీ నేతలు ఆయన ఇచ్చిన విందుకు హాజరుకావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బిహార్ బీజేపీ ముఖ్యనేత అయిన సుశీల్‌కుమార్ మోదీతోపాటు పలువురు ఈ విందులో దర్శనమిచ్చారు. అయితే, బీజేపీ రాష్ట్ర అగ్రనేతలైన ప్రేమ్‌కుమార్, నందకిషోర్ యాదవ్ తదితరులు ఈ విందుకు దూరంగా ఉన్నారు.
నితీశ్ ఆహ్వానం బీజేపీలో చీలిక తెచ్చిందన్న అంశం రాజకీయంగా చర్ఛనీయాంశం కాగా.. 'ఒక విందు కోసం పార్టీ విప్‌ను జారీచేయలేదు కదా. ఒక ఆహ్వాన్నాన్ని మన్నించాలా? వద్దా? అన్నది వ్యక్తిగత అభీష్టం' అని ఈ విషయాన్ని సుశీల్ మోదీ తోసిపుచ్చారు. అయితే, సోమవారం రాత్రి నితీశ్ ఇచ్చిన ఈ డిన్నర్ పార్టీకి ఆయన ప్రస్తుత మిత్రపక్షం లాలూప్రసాద్ యాదవ్ కూడా రాలేదు. అయినా, ప్రజాప్రతినిధి కాకపోవడంతో ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఆయన తనయులు తేజస్వి, తేజ్ ప్రతాప్ సింగ్ మాత్రం హాజరయ్యారు. ఇటీవల బిహార్ రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి.
నితీశ్ తీరుపై లాలూ అసంతృప్తితో ఉన్నారని వినిపిస్తోంది. నితీశ్ సంకీర్ణ ప్రభుత్వంలో లాలూ కీలక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. తన అసంతృప్తినే చాటేందుకే నితీశ్ అధికారిక కార్యక్రమాలకు మంత్రులైన తన తనయులను దూరంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నితీశ్ పాల్గొన్న పలు కార్యక్రమాలకు లాలూ తనయులు డుమ్మా కొట్టారు. మరోవైపు నితీశ్ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయ పరిణామాలు ఆసక్తికర మలుపులు తిరుగుతాయా? అని పరిశీలకులు వేచిచూస్తున్నారు.