
నగదు లావాదేవీలపై సంచలన నిర్ణయం!
దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
- రూ. మూడు లక్షలకు మించి అనుమతించబోం
- బడ్జెట్‌లో తేల్చిచెప్పిన ఆర్థిక మంత్రి జైట్లీ
దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రూ. మూడు లక్షలకు మించి నగదు లావాదేవీలను అనుమతించబోమని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో నల్లధనాన్ని అణచివేసేందుకు రూ. 3 లక్షలకు మించి నగదు లావాదేవీలను అనుమతించరాదని సిట్ కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిఫారసును కేంద్రం ఆమోదించినట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి జైట్లీ వెల్లడించారు.
దేశంలో నల్లధనం అణచివేతకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఇటీవల నల్లధనం అణచివేతపై కేంద్రానికి తన నివేదిక అందజేసిన సిట్.. రూ. మూడు లక్షలకు మంచి నగదు లావాదేవీలను అనుమతించరాదని, వ్యక్తులు లేదా పరిశ్రమలు రూ. 15 లక్షలకు మించి నగదును తమ వద్ద కలిగి ఉండకుండా ఆంక్షలు విధించాలని సిఫారసు చేసింది.
పెద్దనోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలను, డిజిటలైజేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రాజకీయ పార్టీలకు ఒకే సోర్స్ నుంచి రూ. 2000 మించి నగదు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధించినట్టు జైట్లీ స్పష్టం చేశారు. గతంలో ఇది రూ. 20వేల వరకు ఉండేది.