పాస్పోర్ట్ దరఖాస్తులో తండ్రిపేరును కచ్చితంగా నమోదుచేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. చట్టరీత్యా తండ్రిపేరు ట్రావెల్ డాక్యుమెంట్లో తప్పనిసరేమీ కాదని పేర్కొంది. ఈ ఏడాది మేలో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను రిఫర్ చేసుకొని జస్టిస్ సంజీవ్ సచ్దేవా ఈమేరకు తీర్పునిచ్చారు. బయోలాజికల్ ఫాదర్ పేరును నమోదుచేయకపోవడంతో, ఓ యువకుడి పాస్పోర్ట్ను రెన్యువల్ చేయకుండా ఢిల్లీ స్థానిక పాస్పోర్టు ఆఫీసు కార్యాలయం తిరస్కరించింది. దీంతో 2017 జూన్ వరకు వాలిడ్లో ఉన్న ఆ యువకుడి పాస్పోర్టును అథారిటీలు రద్దు చేశాయి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో కోర్సును చేయడానికి 2007లో ఆ యువకుడికి అథారిటీలు పాస్పోర్టు జారీచేశాయి. కోర్సు పూర్తయ్యే ముందు వరకు అతను పాస్పోర్ట్ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అతని పాస్పోర్ట్ను రెన్యువల్ చేయకుండానే అధికారులు రద్దు చేశారు.
2003లో నిర్లక్ష్యంగా వ్యవహరించే తన తండ్రి నుంచి తల్లి విడాకులు పొందిందని, ఈ నేపథ్యంలో రెన్యువల్ ఫామ్లో తండ్రి పేరును నమోదుచేయలేదని ఆ యువకుడు పేర్కొన్నాడు. తండ్రి పేరు లేని అప్లికేషన్ను సాప్ట్ వేర్ ఆమోదించదని, తప్పనిసరిగా తండ్రిపేరు నమోదుచేయాలని పాస్పోర్టు అథారిటీలు వాదించాయి. అయితే తండ్రిపేరు లేనప్పటికీ అతనికి ముందు పాస్పోర్టు జారీచేసిన సంగతిని కోర్టు ప్రశ్నించింది. సాప్ట్వేర్ను సవరించి అతనికి పాస్పోర్టు జారీచేయాలని అథారిటీలను కోర్టు ఆదేశించింది. భర్త నుండి విడాకులు తీసుకున్న ఒక మహిళ తన బిడ్డ ఖర్చు తానే భరిస్తున్నానని, కావున పాస్ పోర్ట్ లో అతని పేరును తొలగించాలని వేసిన పిటీషన్ కు కూడా ఢిల్లీ కోర్టు ఈ విధంగానే స్పందించిన సంగతి తెలిసిందే. పాస్ పోర్ట్ లో తండ్రి పేరు కచ్చితంగా ఉండాలన్న నిబంధనను సడలించాలని అప్పుడే హైకోర్టు సూచించింది.
పాస్పోర్ట్లో తండ్రిపేరు అవసరం లేదు
Published Tue, Aug 23 2016 12:41 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
Advertisement