మేం కూడా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించగలం:షరీఫ్
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్(నిర్దేశిత దాడి) నిర్వహించడంతో షాక్ కు గురైంది. దాడిపై శుక్రవారం ఏర్పాటు చేసిన కేబినేట్ సమావేశంలో పాల్గొన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తమకూ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించ గల సామర్ధ్యం ఉందని పేర్కొన్నారు. దేశ భద్రతకు ఎవరైనా ఆటంకం కలగజేయాలని ప్రయత్నిస్తే.. చూస్తూ ఊరుకోమని అన్నారు.
నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నా ప్రజలను, దేశ సమగ్రతను కాపాడుకోగల సత్తా పాక్ కు ఉందని చెప్పారు. భారత్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని షరీఫ్ వ్యాఖ్యానించినట్లు ఓ ప్రముఖ పాకిస్తాన్ పత్రిక పేర్కొంది. నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు భారత ఆర్మీ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, భారత్ ప్రకటనను పాక్ తోసిపుచ్చింది. ఉడి ఉగ్రదాడిపై విచారణ చేయాలని షరీఫ్ ఆదేశించినట్లు తెలిసింది. దాడిలో పాక్ హస్తం ఉందని భారత్ చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని షరీఫ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.