లలిత్ గేట్ వ్యవహారం, వ్యాపం కుంభకోణానికి సంబంధించి ఎవరి రాజీనామాలు ఉండబోవని మరోసారి కేంద్ర ప్రభుత్వం విపక్షాలకు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: లలిత్ గేట్ వ్యవహారం, వ్యాపం కుంభకోణానికి సంబంధించి ఎవరి రాజీనామాలు ఉండబోవని మరోసారి కేంద్ర ప్రభుత్వం విపక్షాలకు స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా ఆధార రహితమైనవి అయినందున కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్గానీ, బీజేపీ ముఖ్యమంత్రులుగానీ రాజీనామాలు చేయబోరని పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. ప్రతి పక్షాలు చేస్తున్న దుష్ప్రచారానికి సరైన సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వివరణ ఇచ్చి వారి ఆరోపణలు తప్పని రుజువుచేయాలని నిర్ణయించామని తెలిపారు.
బీజేపీ పార్లమెంటరీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేవలం సభా వ్యవహారాలను భంగపరిచే ఆలోచన తప్ప ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఒక అంశంపై చర్చించాలన్న ఆలోచన, ఉద్దేశం లేదని ఆయన ఆరోపించారు. అందుకే తాము ఎంత చెబుతున్నా వినకుండా అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు భయపడాల్సిన అవసరం లేదని, మనం చేస్తున్న మంచిపనులు చూసి గర్వపడండంటూ మోదీ తమకు మరోసారి సమావేశంలో గుర్తు చేశారని తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా విపక్షాలను విమర్శించారు. చర్చకు తాము సిద్ధమని చెప్తున్నా కావాలనే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని ఆరోపించారు.