'ఒంటరిగా పోటీ చేస్తాం.. మాదే అధికారం'
లక్నో: 2017లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో పొత్తుల గురించి ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి బీజేపీ వైఖరిని స్పష్టం చేశారు.
డీడీసీఏ వివాదంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నఖ్వీ చెప్పారు. ఢిల్లీ ఆప్ ప్రభుత్వం నిరాధారమైన ఆరోపణలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సంకుచిత స్వభావంతో దేశాభావృద్ధిని కోరుకోవడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ 'అవినీతికి తల్లి' వంటి పార్టీ అని కేంద్ర మంత్రి అన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటన గురించి మీడియా ప్రశ్నకు సమాధానంగా కొత్త ఏడాది వేడుకలను ఎవరైనా ప్రపంచంలో ఎక్కడైనా చేసుకోవచ్చని అన్నారు. విదేశీ పర్యటన రాహుల్కు మంచి బుద్ధి కలిగించాలని నఖ్వీ చెప్పారు.