ఆగని బలిదానాలు..!
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం బలిదానాలు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన లక్ష్మయ్య ఆత్మహత్య ఘటన కళ్ల ముందు కదలాడుతుండగానే... శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు మరణించారు. మరొకరు బలిదానానికి సిద్ధపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఉదయభాను ఉరివేసుకోగా... కర్నూలు జిల్లా సి.బెళగల్‌లో లోకేశ్వరరావు గుండెపోటుతో మరణించారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం గరిశింగి గ్రామానికి చెందిన ధర్మిశెట్టి దేముడు నాయుడు బలిదానానికి సిద్ధపడ్డారు.
సాక్షి నెట్‌వర్క్: ‘ఫర్ ఏపీ స్టూడెంట్స్ అండ్ రెలిజియన్స్ దిస్ ఇజ్ టు బి డన్‌బై అవర్‌సెల్ఫ్‌స్(ఆంధ్రా విద్యార్థులారా.. ప్రజలారా.. ఇది మనమే సాధించుకోవాలి), మన ఏపీకి స్వతంత్య్రం వస్తుందా? అది మనకు సాధ్యమేనా? మనం అన్యాయం అయిపోయామా? సోనియమ్మ మనకు అన్యాయం చేసింది. ఈ రాజకీయాలు ఎప్పుడు మారతాయి? వీటన్నింటికీ పాలకులు సమాధానం ఇస్తారా? గెట్ ఏపీ ఫ్రీ ఐదర్ డెడ్ ఆర్ ఎలైవ్(బతికైనా.. చచ్చయినా రాష్ట్రానికి స్వాతంత్య్రాన్ని సాధించుకోవాలి)... ఇది ఓ యువకుడి ఆవేదనకు అక్షరం రూపం.
ఏపీకి ప్రత్యేక హోదా దక్కాలని కోరుతూ కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సిరిపురపు ఉదయభాను సూసైడ్ నోట్ ఇది. పట్టణంలోని శ్రీరామ్‌పురానికి చెందిన సిరిపురపు ఉదయభాను(40) పాలిటెక్నిక్ చదువుకున్నాడు. కొంతకాలం ప్రైవేట్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేశాడు. ఇటీవలి కాలంలో ఉదయభాను తల్లి, పట్టణ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు తులసీరాణికి రేషన్‌షాపు డీలర్‌షిప్ రావటంతో షాపు నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మరో ‘గుండె’ ఆగింది
‘ప్రత్యేక హోదా’ రాదేమోనన్న బెంగతో కర్నూలు జిల్లాలోని సి.బెళగల్‌లో గనుమాల లోకేశ్వరరావు (37) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఎంటెక్ పూర్తి చేసిన లోకేశ్వరరావు ఎమ్మిగనూరులోని సెయింట్ జోసెఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. గురువారం మాలమహానాడు ఆధ్వర్యంలో కర్నూలులోని బీజేపీ కార్యాలయం ముట్టడిలోనూ పాల్గొన్నారు.
ఆ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. టీడీపీ, బీజేపీ నేతల కారణంగా ప్రత్యేక హోదా ప్రకటించే పరిస్థితి లేదని ఆవేదన చెందారు. ఇంటికి చేరుకుని భార్య, కుటుంబసభ్యులతో ప్రత్యేక హోదాపై మాట్లాడుతుండగానే తీవ్ర గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే తనువు చాలించారు.
విశాఖ జిల్లాలో ఆత్మహత్యాయత్నం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం గరిశింగి గ్రామానికి చెందిన ధర్మిశెట్టి దేముడు నాయుడు(32) ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడ్డా డు. ప్రత్యేకహోదా రాదన్న విషయమై కలత చెందిన దేముడు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మండల కేంద్రం దేవరాపల్లిలో గల రైవాడ జలాశయం అతిథి గృహం వద్దకు వచ్చాడు. తన వెంట తెచ్చిన కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకున్నారు.