హోదా కోసం ఆగిన మరో గుండె
గూడూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే మనస్తాపంతో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ... గూడూరు మండల కేంద్రానికి చెందిన గనుమాని లోకేశ్వరరావు(32) ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్ గా పని చేస్తున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలనే డిమాండ్‌తో గురువారం కర్నూలులో మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ కార్యాలయ ముట్టడిలో లోకేశ్వరరావు పాల్గొన్నాడు.
గురువారం రాత్రి గూడూరుకు వచ్చిన లోకేశ్వరరరావు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే.. ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని, తనలాంటివారికి ఉపాధి లభిస్తుందని కుటుంబసభ్యులకు చెప్పాడు. అయితే, టీడీపీ, బీజేపీ నేతల కారణంగా ప్రత్యేక హోదా ప్రకటించే పరిస్థితి లేదని ఆవేదన చెందాడు. కొద్దిసేపటి తర్వాత అతడు తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. లోకేశ్వరరావుకు భార్య కృష్ణవేణి, కుమారుడు(3) ఉన్నారు. సీఐ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.