ట్విట్టర్ కొనుగోలు రేసులో మరో దిగ్గజం
ట్విట్టర్ కొనుగోలు రేసులో మరో దిగ్గజం
Published Tue, Sep 27 2016 1:22 PM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM
న్యూయార్క్ : ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ను చేజిక్కించుకోవడానికి గూగుల్, సేల్స్ఫోర్స్ రేసులోకి మరో మీడియా దిగ్గజం వచ్చి చేరింది. ట్విట్టర్ కొనుగోలుకు టెక్ దిగ్గజంతో పోటీ పడటానికి వాల్ట్డిస్నీ కంపెనీ ముందుకొచ్చింది. ట్విట్టర్ను డిస్నీ కంపెనీ సొంతం చేసుకుంటే ఆ కంపెనీకి ఇదే అతిపెద్ద టెక్నాలజీ డీల్గా వాల్స్ట్రీట్ జర్నల్ రిపోర్టు వెల్లడించింది. ట్విట్టర్ ఇటీవలే స్ట్రీమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్లను ఆన్లైన్లో అందించడానికి పెట్టుబడులు పెట్టింది. ట్విట్టర్ స్పోర్ట్స్ ప్రోగ్రామింగ్ ప్రయత్నాలను ఓ శక్తివంతమైన ప్రత్యర్థిగా ఈ మీడియా దిగ్గజం భావించింది. విజయవంతంగా ట్విట్టర్ను డిస్నీ సొంతం చేసుకుంటే, ఈఎస్పీఎన్ చానల్ సేవలను మరింత విస్తరించడానికి డిస్నీకి ఈ టెక్నాలజీ సంస్థ ఓ సాధనంగా ఉపయోగపడుతుందని వాల్స్ట్రీట్ రిపోర్టు పేర్కొంది.
ఈఎస్పీఎన్ అమెరికాకు చెందిన గ్లోబల్ కేబుల్,శాటిలైట్ టెలివిజన్ చానల్. దీని యాజమాన్య హక్కులను 1996లో డిస్నీ సొంతం చేసుకుంది. గత నెలరోజులుగా ట్విట్టర్ అమ్మక వార్త మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ట్విట్టర్ విక్రయానికి ఆ సంస్థ దిగ్గజ కంపెనీలతో సంప్రదింపులు కూడా ప్రారంభించింది. ట్విట్టర్ అమ్మక వార్త ఊపందుకోవడంతో ఆ కంపెనీ షేర్లు గతవారంతో 20 శాతానికి పైగా ఎగిశాయి. నెలకు 313 మిలియన్ యాక్టివ్ యూజర్లున్న ఆ సంస్థకు ప్రస్తుతం యూజర్ల వృద్ధి మందగించి, ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం ఆ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 16 బిలియన్ డాలర్లు.
Advertisement
Advertisement