డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లాల్సిన పనిలేదు!
న్యూఢిల్లీ: వాహనచోదకులకు శుభవార్త. తరచూ డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్ సీ) లను మర్చిపోయి బయటకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారా? ఇక ముందు అలాంటి సమస్యలు ఉండవు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో 'డిజీ లాకర్' యాప్ ను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా ఏ ప్రాంతం నుంచి అయినా మొబైల్ ను ఉపయోగించి డీఎల్, ఆర్ సీ లను చూసుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు, ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు యాప్ ద్వారా వ్యక్తుల వివరాలను కూడా తెలుసుకోవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
'డిజీ లాకర్'లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు నంబర్ ను మొబైల్ నంబర్ తో లింక్ చేయాల్సి వుంటుందని చెప్పారు. ఈ యాప్ ను ఐటీ, రవాణా శాఖల మంత్రులు బుధవారం విడుదల చేయనున్నారు. డీఎల్, ఆర్ సీల్లో ఏవైనా తేడాలు ఉంటే పెనాల్టీ పాయింట్లను జోడించే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు ఈ-చలాన్లు జారీ చేయడంలో దేశంలోనే ముందున్నాయి.